భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్ స్మృతి మంధానా మరియు సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ వివాహం అనిశ్చితంగా వాయిదా పడటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అసలు ఆదివారం రోజున మంధానా స్వగ్రామం సాంగ్లీలో జరగాల్సిన ఈ వివాహ వేడుకను వాయిదా వేసిన ఒక రోజు తర్వాత, స్మృతి మంధానా తన సోషల్ మీడియా ఖాతాల నుండి పెళ్లికి సంబంధించిన పోస్ట్‌లు అన్నింటినీ తొలగించడం అభిమానులను ఆందోళనకు గురిచేస్తుంది. మొదట్లో వేడుకల గురించి ఆనందంగా ఉన్న వాతావరణం, ఒక్కసారిగా ఆందోళన, ఆవేదన వైపు మళ్లింది.
AKhanda 2: ఫైట్లన్నీ స్వయంగా చేశారు.. బాలయ్య పై ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్ సంచలనం!
వివాహ వేడుక వాయిదాకు ప్రధాన కారణం స్మృతి మంధానా తండ్రి శ్రీనివాస్ మంధానాకు ఆకస్మికంగా ఆరోగ్య సమస్య తలెత్తడమే. ఆదివారం ఉదయం అల్పాహారం తీసుకుంటున్న సమయంలో శ్రీనివాస్ మంధానాకు గుండె సంబంధిత సమస్యల లక్షణాలు కనిపించాయి. పరిస్థితి విషమించడంతో వెంటనే అంబులెన్స్ పిలిపించి, ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. తన తండ్రితో బలమైన అనుబంధం ఉన్న మంధాన, తన క్రికెట్ ప్రయాణంలో ఆయనే కీలమని తరచూ చెప్తూ ఉంటారు. అందుకే ఆయన పూర్తిగా కోలుకునే వరకు పెళ్లిని వాయిదా వేయాలని స్మృతి వెంటనే నిర్ణయం తీసుకున్నట్లు ఆమె మేనేజర్ తుహిన్ మిశ్రా ధృవీకరించారు. “తన తండ్రి కోలుకోవడంపైనే స్మృతి పూర్తిగా దృష్టి పెట్టింది, ఆ తర్వాతే పెళ్లి చేసుకుంటానని ఆమె స్పష్టం చేసింది” అని మిశ్రా తెలిపారు.
పెళ్లి వాయిదా పడటానికి కొద్ది రోజుల ముందు, మెహందీ, హల్దీ, సంగీత్ వంటి వారపు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో జెమిమా రోడ్రిగ్స్, రాధా యాదవ్, షఫాలీ వర్మ వంటి టీమ్ ఇండియా సహచరులు కూడా పాల్గొన్నారు. ‘వధువు జట్టు వర్సెస్ వరుడు జట్టు’ మధ్య జరిగిన సరదా క్రికెట్ మ్యాచ్ మరియు మంధాన తన సహచరులతో కలిసి డ్యాన్స్ చేసిన వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే, నిశ్చితార్థం పోస్ట్‌లు, తెరవెనుక క్షణాలతో సహా, వేడుకలకు సంబంధించిన అన్ని ఫోటోలు, వీడియోలను మంధాన తొలగించడం అందరి దృష్టిని ఆకర్షించింది. కొందరు దీనిపై అనుమానం వ్యక్తం చేసినప్పటికీ, చాలా మంది నెటిజన్లు ఆమె నిర్ణయాన్ని అర్థం చేసుకుని, కుటుంబంపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. అభిమానులు ఆమె తండ్రి త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ, మంధానాకు తమ మద్దతును తెలియజేస్తున్నారు.
