Cricket Australia: దంచికొట్టిన స్మిత్, లబూషేన్

సొంతగడ్డపై వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా భారీస్కోర్ సాధించింది.

  • Written By:
  • Updated On - December 1, 2022 / 01:53 PM IST

సొంతగడ్డపై వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా భారీస్కోర్ సాధించింది. స్టీవ్ స్మిత్, లబూషేన్ ఇద్దరూ డబుల్ సెంచరీలతో చెలరేగిపోయారు. వార్నర్ 5 , ఖవాజా 65 పరుగులకు ఔటవగా.. తర్వాత స్మిత్, లబూషేన్ విండీస్ బౌలర్లను ఆటాడుకున్నారు. భారీ షాట్లతో రెచ్చిపోయారు. వీరిద్దరూ మూడో వికెట్ కు 251 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలో లబూషేన్ 350 బంతుల్లో 20 ఫోర్లు , 1 సిక్సర్ తో 204 పరుగులు చేశాడు. అటు స్మిత్ కూడా 311 బంతుల్లో 16 ఫోర్లతో 200 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. రెండో రోజు చివరి సెషన్ కు ముందు ఆస్ట్రేలియా 558 పరుగుల దగ్గర ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ట్రావిస్ హెడ్ 1 పరుగు తేడాతో సెంచరీ చేజార్చుకుని 99 పరుగులకు ఔటయ్యాడు.

ఈ మ్యాచ్ లో స్మిత్‌.. క్రికెట్‌ దిగ్గజం డాన్‌ బ్రాడ్‌మన్‌ రికార్డును సమం చేశాడు. బ్రాడ్‌మన్‌ తన 52 మ్యాచ్‌ల టెస్ట్‌ కెరీర్‌లో 29 శతకాలు సాధించగా.. స్మిత్‌ తన 88 టెస్ట్‌ మ్యాచ్‌లో ఈ మైలురాయిని చేరుకున్నాడు. అలాగే స్మిత్‌.. టెస్ట్‌ల్లో ఆస్ట్రేలియా తరఫున అత్యధిక సెంచరీలు సాధించిన నాలుగో బ్యాటర్‌గా కూడా నిలిచాడు. ఆసీస్‌ తరఫున అత్యధిక టెస్ట్‌ సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో రికీ పాంటింగ్‌ 41 శతకాలతో టాప్‌లో ఉండగా.. స్టీవ్‌ వా, మాథ్యూ హేడెన్‌ రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. వీరి తర్వాత స్మిత్‌.. బ్రాడ్‌మన్‌తో కలిసి నాలుగో ప్లేస్‌లో ఉన్నాడు.