Site icon HashtagU Telugu

Ross Taylor : ఆ ఫ్రాంచైజీ ఓనర్ నన్ను కొట్టాడు.. టేలర్ సంచలన వ్యాఖ్యలు

Ross Taylor

Ross Taylor

న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ రాస్ టేలర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్‌లో ఆడినప్పుడు ఓ ఫ్రాంచైజీ యజమాని తనను కొట్టాడని ఆరోపించాడు. రాస్ టేలర్ తన ఆటో బయోగ్రఫీ బ్లాక్ అండ్ వైట్ పుస్తకంలో ఈ విషయం వెల్లడించాడు. రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్నప్పుడు ఈ ఘటన జరిగినట్టు టేలర్ తన పుస్తకంలో పేర్కొన్నాడు. మొహాలీ వేదికగా పంజాబ్‌లో మ్యాచ్ జరిగినప్పుడు తాము 195 పరుగులు చేయాల్సి వచ్చిందన్నాడు. ఈ మ్యాచ్‌లో తాను ఎల్బీడబ్ల్యూ రూపంలో డకౌటైయ్యానని, తమ జట్టు కూడా గెలవలేదన్నాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత జట్టుతో పాటు సహాయక సిబ్బంది, మేనేజ్‌మెంట్‌తో కలిసి హోటల్‌లో కూర్చున్నామని, అక్కడ షేన్ వార్న్, లిజ్ హుర్లే వంటి వారూ ఉన్నారన్నాడు. ఆ సమయంలో రాజస్థాన్ రాయల్స్ ఓనర్‌ ఒకరు తన దగ్గరు వచ్చి మీకు మిలియన్ డాలర్లు ఇచ్చేది డకౌట్ కావడానికి కాదంటూ తన మొహం మీద నాలుగు సార్లు కొట్టాడని టేలర్ చెప్పాడు. అవేమీ గట్టి దెబ్బలు కాకున్నా… సరదాగా కొట్టినట్టు కూడా తనకు అనిపించలేదన్నాడు. ఆ పరిస్థితుల్లో తాను దానిని పెద్ద విషయం చేయలదలుచుకోలేదని, అయితే క్రీడావృత్తిలో అలాంటివి సరికాదని అభిప్రాయపడ్డాడు.ఇది ఏ ఏడాది జరిగిందనే విషయాన్ని మాత్రం రాస్ టేలర్ చెప్పలేదు. రాస్ టేలర్ 2008 నుంచి 2010 వరకూ రాయల్ ఛాలెంజర్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 2011లో రాజస్థాన్‌ రాయల్స్‌కు ఆడిన ఈ కివీస్ మాజీ ప్లేయర్ ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్‌ తరపున ఆడాడు.ఐపీఎల్‌లో 55 మ్యాచ్‌లు ఆడిన టేలర్ 1017 పరుగులు సాధించాడు. ప్రస్తుతం టేలర్ చేసిన వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.