Site icon HashtagU Telugu

Saliya Saman: శ్రీలంక మాజీ క్రికెటర్‌పై ఐసీసీ ఐదేళ్ల నిషేధం!

Saliya Saman

Saliya Saman

Saliya Saman: శ్రీలంకకు చెందిన మాజీ ఆల్‌రౌండర్ సలియా సమన్‌ (Saliya Saman)పై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఐదేళ్ల నిషేధం విధించింది. ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) యాంటీ-కరప్షన్ కోడ్‌ను ఉల్లంఘించినందుకు గాను ఈ నిర్ణయం తీసుకున్నారు. 2021లో జరిగిన అబుదాబి టీ10 లీగ్‌లో మ్యాచ్ ఫిక్సింగ్‌కు ప్రయత్నించినట్లు అతనిపై ఆరోపణలు ఉన్నాయి.

నిషేధానికి దారితీసిన కారణాలు

సమన్‌పై ఐసీసీ యాంటీ-కరప్షన్ ట్రిబ్యునల్ నిర్వహించిన విచారణలో అతను దోషిగా తేలాడు. దీని కారణంగా ఏ రకమైన క్రికెట్ ఆడకుండా అతనిపై ఐదేళ్ల నిషేధం విధించారు. సెప్టెంబర్ 2023లో అతనిపై తాత్కాలిక సస్పెన్షన్ విధించగా.. ఇప్పుడు అది అధికారిక నిషేధంగా మారింది. నిబంధనల ఉల్లంఘనలో భాగంగా సమన్ 2021 అబుదాబి టీ10 లీగ్‌లో మ్యాచ్‌లను ఫిక్స్ చేయడానికి ప్రయత్నించాడు. అంతేకాకుండా సహ ఆటగాళ్లను అవినీతికరమైన చర్యల్లో పాల్గొనడానికి డబ్బు లేదా ఇతర బహుమతులు ఆఫర్ చేసినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ తీవ్రమైన ఉల్లంఘనల కారణంగానే ఐసీసీ కఠినమైన చర్యలు తీసుకుంది.

Also Read: Nagaland Governor Ganesan: నాగాలాండ్ గవర్నర్ గణేశన్ కన్నుమూత!

సలియా సమన్ క్రికెట్ కెరీర్

39 ఏళ్ల సలియా సమన్ శ్రీలంక దేశీయ క్రికెట్‌లో ఒక ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందాడు. అతను శ్రీలంక తరపున అండర్-17, అండర్-19 జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. దేశీయ స్థాయిలో లంకన్ క్రికెట్ క్లబ్, రాగమ క్రికెట్ క్లబ్, గాలె క్రికెట్ క్లబ్ వంటి పలు జట్ల తరపున ఆడాడు.

సమన్ తన కెరీర్‌లో 101 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లలో 3,662 పరుగులు చేసి, 231 వికెట్లు తీశాడు. లిస్ట్ ఎ క్రికెట్‌లో 77 మ్యాచ్‌లలో 898 పరుగులు, 84 వికెట్లు సాధించాడు. టీ20 క్రికెట్‌లో 47 మ్యాచ్‌లలో 673 పరుగులు చేసి, 58 వికెట్లు తీసుకున్నాడు. దేశీయ క్రికెట్‌లో మంచి రికార్డు ఉన్నప్పటికీ మ్యాచ్ ఫిక్సింగ్ ప్రయత్నాల వల్ల అతని కెరీర్‌కు మచ్చ పడింది. ఐసీసీ తీసుకున్న ఈ నిర్ణయం క్రికెట్ ప్రపంచంలో అవినీతిని ఏ మాత్రం సహించరనే సందేశాన్ని ఇస్తుంది.