India tour of Bangladesh: బంగ్లా గడ్డపై టీమిండియా ప్రాక్టీస్ షురూ

కివీస్ టూర్ ముగించుకున్న భారత్ ఇప్పుడు బంగ్లాతో సీరీస్ కు రెడీ అయ్యింది.

  • Written By:
  • Publish Date - December 3, 2022 / 12:08 PM IST

కివీస్ టూర్ ముగించుకున్న భారత్ ఇప్పుడు బంగ్లాతో సీరీస్ కు రెడీ అయ్యింది. ఇప్పటికే అక్కడికి చేరుకున్న ఆటగాళ్ళు ప్రాక్టీస్ మొదలు పెట్టారు. న్యూజిలాండ్ పర్యటనకు విశ్రాంతి తీసుకున్న సీనియర్ ఆటగాళ్లు, కోచ్ రాహుల్ ద్రవిడ్ ఈ సిరీస్‌కు పునరాగమనం చేస్తున్నారు. హార్దిక్ కెప్టెన్సీలో టీ20 సిరీస్ గెలిచిన భారత్.. ధావన్ సారథ్యంలో వన్డే సిరీస్ కోల్పోయింది. దీంతో బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌లో తిరిగి తన జైత్రయాత్రను కొనసాగించాలని భారత్ భావిస్తోంది. ఆదివారం నుంచి ఈ సీరీస్ మొదలు కానుంది. ఈ పర్యటనకు టీమిండియా రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ తిరిగి పగ్గాలు అందుకోనున్నాడు. న్యూజిలాండ్ పర్యటనలో ఆడిన సూర్యకుమార్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్యా, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్ ఈ సిరీస్‌కు దూరంగా ఉన్నారు. దాంతో టీమిండియా తుది జట్టుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఆదివారం జరిగే తొలి వన్డేతో భారత్.. బంగ్లాదేశ్ పర్యటనను మొదలుపెట్టనుంది. మూడు వన్డేల సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు ఢాకా‌లోని షేర్ ఈ బంగ్లా నేషనల్ స్టేడియం వేదికగా జరగనున్నాయి. తొలి వన్డే ఆదివారం జరగనుండగా.. రెండో వన్డే డిసెంబర్ 7న, మూడో వన్డే డిసెంబర్ 10న జరగనుంది. మూడు వన్డే మ్యాచ్‌లు భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 11.30 గంటలకు ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 14-18 వరకు చట్టోగ్రమ్ వేదికగా తొలి టెస్ట్, డిసెంబర్ 22-26 వరకు ఢాకా వేదికగా రెండో టెస్ట్ జరగనుంది.

బంగ్లాదేశ్ తో వన్డేలకు భారత జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్, రజత్ పాటిదార్, రాహుల్ త్రిపాఠి, షబాజ్ అహ్మద్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ సేన్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, శిఖర్ ధావన్, రిషబ్ పంత్.