Mohammad Siraj : అంతర్జాతీయ క్రికెట్‌లో హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ దుమ్మురేపుతున్నాడు. ఆసియాకప్ ఫైనల్లో సంచలన ప్రదర్శనతో భారత్‌కు ట్రోఫీ అందించిన సిరాజ్ తాజాగా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్ బౌలర్‌గా నిలిచాడు. ఈ ప్రదర్శనతో ఏకంగా 8 స్థానాలు ఎగబాకిన సిరాజ్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. వన్డే ర్యాంకింగ్స్‌లో సిరాజ్ (Siraj) నెంబర్ వన్ కావడం ఇది రెండో సారి. ఈ ఏడాది జనవరిలోనూ అతను టాప్ బౌలర్‌గా ఉన్నాడు. ఆసియాకప్ ఫైనల్ ముందు వరకూ ఆసీస్ పేసర్ హ్యాజిల్‌వుడ్ టాప్ ప్లేస్‌లో ఉండగా.. లంకపై ఆరు వికెట్ల ప్రదర్శనతో సిరాజ్ (Siraj) 9వ స్థానంలో నుంచి నెంబర్ వన్ ర్యాంకుకు దూసుకెళ్ళాడు. గత కొంతకాలంగా అన్ని ఫార్మాట్లలోనూ సిరాజ్ అదరగొడుతున్నాడు. గత రెండేళ్ళ కాలంలో ఇటు టెస్టుల్లోనూ , అటు వన్డేల్లోనూ నిలకడగా రాణిస్తున్న ఈ హైదరాబాదీ ప్రస్తుతం టీమిండియాలో కీలక బౌలర్‌గా ఉన్నాడు. గతంలో బూమ్రా గాయంతో దూరమైనప్పుడు భారత పేస్ ఎటాక్‌ను లీడ్ చేసిన సిరాజ్ (Siraj) అద్భుత ప్రదర్శనను కొనసాగిస్తున్నాడు. వన్డే కెరీర్‌లో ఇప్పటి వరకూ 29 మ్యాచ్‌లు ఆడిన సిరాజ్ 53 వికెట్లు పడగొట్టాడు. శ్రీలంకపై సిరాజ్‌ది అతని కెరీర్‌లోనే అత్యుత్తమ ప్రదర్శన.
ఇదిలా ఉంటే ఐసీసీ తాజా ర్యాంకింగ్స్‌లో హ్యాజిల్‌వుడ్ , బౌల్ట్ రెండు,మూడు స్థానాల్లో ఉండగా.. ఆఫ్ఘనిస్థాన్ స్పిన్నర్లు ముజీబుర్ రహమాన్, రషీద్‌ఖాన్ నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్నారు. బౌలింగ్ జాబితా టాప్ టెన్‌లో కుల్దీప్ యాదవ్ తొమ్మిదో స్థానంలో నిలిచాడు. మరోవైపు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ రెండో స్థానంలోనూ, సౌతాఫ్రికా బ్యాటర్ డసెన్ మూడో ర్యాంకులోనూ నిలిచారు. శుభ్‌మన్ గిల్‌కూ, బాబర్ అజామ్‌కు మధ్య 43 పాయింట్లు మాత్రమే తేడా ఉంది. ఆసీస్‌తో వన్డే సిరీస్‌లో గిల్ ఫామ్ కొనసాగిస్తే నెంబర్ వన్ ర్యాంక్ కైవసం చేసుకునే అవకాశముంటుంది. ఇక టీమ్ ర్యాంకింగ్స్‌లో భారత్ రెండో స్థానంలో ఉండగా…ఆసీస్‌పై వన్డే సిరీస్ గెలిస్తే టాప్ ప్లేస్‌కు చేరుకుంటుంది.
Also Read: Team India Jersey: వన్డే ప్రపంచకప్ కోసం టీమిండియా జెర్సీని విడుదల చేసిన బీసీసీఐ.. వీడియో..!