PV Sindhu: కోచ్ పార్క్‌తో సింధు కటీఫ్‌.. కారణమిదే..?

హైదరాబాదీ బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ పివి సింధు (PV Sindhu) కీలక నిర్ణయం తీసుకుంది. గత కొంతకాలంగా స్థాయికి తగినట్టు నిలకడగా రాణించలేకపోతోన్న సింధు కొత్త కోచ్ వేటలో పడింది. ప్రస్తుత కోచ్‌ పార్క్‌కు ఆమె గుడ్‌బై చెప్పేసింది.

  • Written By:
  • Publish Date - February 25, 2023 / 09:01 AM IST

హైదరాబాదీ బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ పివి సింధు (PV Sindhu) కీలక నిర్ణయం తీసుకుంది. గత కొంతకాలంగా స్థాయికి తగినట్టు నిలకడగా రాణించలేకపోతోన్న సింధు కొత్త కోచ్ వేటలో పడింది. ప్రస్తుత కోచ్‌ పార్క్‌కు ఆమె గుడ్‌బై చెప్పేసింది. తమ గురుశిష్యుల బంధం ముగిసిందని పార్క్ ప్రకటించాడు. సింధు పరాజయాల్లో తన పాత్ర కూడా ఉందంటూ ఇటీవలే సోషల్ మీడియాలో ఆయన వ్యాఖ్యానించాడు. సింధు పేలవ ప్రదర్శనకు తనదే బాధ్యతంటూ చెప్పుకొచ్చాడు. ఇటీవల తాను ఆశించిన విజయాలను సింధు అందుకోలేకపోవడమే సింధు నిర్ణయానికి కారణం.

గాయంతో ఐదు నెలలు ఆటకు దూరమైన సింధు జనవరిలో జరిగిన మలేసియా ఓపెన్‌తో మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లోనే కరోలినా మారిన్ చేతిలో ఓడిన ఆమె, సొంతగడ్డపై జరిగిన ఇండియా ఓపెన్‌లోనూ అనూహ్యంగా మొదటి రౌండ్‌లోనే పరాజయం పాలైంది. ఆసియా మిక్స్‌డ్‌ చాంపియన్‌షిప్‌లో ఒక మ్యాచ్‌ గెలవగలిగినా.. ర్యాంకింగ్స్‌లో తనకంటే ఎంతో దిగువన ఉన్న గావో ఫాంగ్‌ జి చేతిలో ఓడిపోవడం ఆశ్చర్యపరిచింది.

Also Read: Gold And Silver Price Today: తెలుగు రాష్ట్రాలలో నేటి బంగారం, వెండి ధరలివే..!

2019 నుంచి సింధుకు పార్క్‌ వ్యక్తిగత కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. బాయ్‌ అతన్ని మొదట్లో పురుషుల సింగిల్స్‌ కోచ్‌గా నియమించినా.. తర్వాత సింధు వ్యక్తిగత కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. పార్క్ కోచింగ్‌లోనే సింధు మూడు బీడబ్ల్యూఎఫ్‌ టైటిల్స్‌తో పాటు కామన్వెల్త్‌ క్రీడల్లో కూడా సింధు స్వర్ణం సాధించింది. అలాగే టోక్యో ఒలింపిక్స్‌లో సింధు కాంస్యం సాధించడం కోచ్‌గా పార్క్‌కు మరో ఘనతగా మిగిలింది. అయితే గాయం నుంచి కోలుకుని ఈ ఏడాది ఆరంభం నుంచీ పలు టోర్నీల్లో సింధు ప్రదర్శన ఏమాత్రం బాగాలేదు. దీంతో కొత్త కోచ్‌ను నియమించుకుంటానని ఆమె పార్క్‌కు చెప్పేసింది. సింధు నిర్ణయాన్ని కూడా పార్క్ స్వాగతించాడు.

ఇటీవల ఆమె ప్రదర్శన బాగాలేదనీ, ఒక కోచ్‌గా తాను కూడా అందుకు బాధ్యుడనేనని చెప్పాడు. కొత్త కోచ్‌ కావాలని ఆశిస్తున్న సింధు నిర్ణయాన్ని తాను గౌరవిస్తున్నానని తెలిపాడు. సింధు కోచ్‌గా తప్పుకున్న పార్క్‌ ఇప్పటికే గచ్చిబౌలిలో భారత జూనియర్‌ జట్టుకు కోచింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే భారత చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్‌తో విడిపోయినప్పటి నుంచి సింధు సుచిత్ర అకాడమీలో ప్రాక్టీస్ చేస్తోంది. కేంద్ర క్రీడాశాఖ టార్గెట్‌ ఒలింపిక్‌ పోడియం టాప్ పథకం ప్రకారం తన వ్యక్తిగత కోచ్‌ను ఎంచుకునే అవకాశం సింధుకు ఉంటుంది. ఇప్పుడు పార్క్‌తో తెగతెంపులు చేసుకున్న సింధు మలేషియా మాజీ ఆటగాడు హఫీజ్ హషీమ్‌ ఆధ్వర్యంలో శిక్షణ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే సుచిత్ర అకాడమీ హఫీజ్‌తో తమ షట్లర్ల కోసం ఒప్పందం చేసుకుంది. ప్రస్తుతం అక్కడే ప్రాక్టీస్ చేస్తున్న సింధు హఫీజ్‌ ఆధ్వర్యంలోనే శిక్షణ కొనసాగించే అవకాశముంది.