టీ20 వరల్డ్ కప్ 2026 జట్టు నుండి శుభ్‌మన్ గిల్ అవుట్.. కార‌ణ‌మిదేనా?

ఈ ఏడాది గిల్ టెస్ట్ కెప్టెన్‌గా ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో 754 పరుగులు చేసి అదరగొట్టారు. దీంతో ఆయనకు వన్డే కెప్టెన్సీ, టీ20 వైస్ కెప్టెన్సీ కూడా దక్కాయి.

Published By: HashtagU Telugu Desk
Shubman Gill

Shubman Gill

Shubman Gill: టెస్ట్, వన్డే జట్లకు కెప్టెన్‌గా ఉన్న శుభ్‌మన్ గిల్‌ను టీ20 వరల్డ్ కప్ 2026 జట్టు నుండి తప్పించడం ఇప్పుడు క్రీడాలొకంలో హాట్ టాపిక్ అయ్యింది. దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో వైస్ కెప్టెన్‌గా ఉన్న గిల్.. పేలవ ప్రదర్శన కారణంగా జట్టులో చోటు కోల్పోయారు. గిల్ గాయం కారణంగా కాకుండా ఫామ్ లేమి వల్లే డ్రాప్ అయ్యారని తెలుస్తోంది.

బీసీసీఐ రహస్య సమావేశం

ఓ నివేదిక ప్రకారం.. ధర్మశాలలో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 మ్యాచ్ తర్వాత బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా ఒక రహస్య సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వరల్డ్ కప్ జట్టు ఎంపికకు ముందు ఆటగాళ్ల ప్రదర్శనపై చీఫ్ సెలెక్టర్ నుండి ఆయన నివేదిక కోరారు. ఈ సమావేశం అత్యంత గోప్యంగా జరిగింది.

గిల్ ఫామ్‌పై వెల్లువెత్తిన ప్రశ్నలు

ఈ ఏడాది గిల్ టెస్ట్ కెప్టెన్‌గా ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో 754 పరుగులు చేసి అదరగొట్టారు. దీంతో ఆయనకు వన్డే కెప్టెన్సీ, టీ20 వైస్ కెప్టెన్సీ కూడా దక్కాయి. కానీ ఏడాది చివరలో గిల్ తడబడ్డారు. దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి మూడు టీ20ల్లో గిల్ వరుసగా 4, 0, 28 పరుగులు మాత్రమే చేయగలిగారు. గిల్ జట్టులోకి రావడం వల్ల ఓపెనర్‌గా రాణిస్తున్న సంజూ శాంసన్ తన బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చుకోవాల్సి వచ్చింది. ఇది జట్టు సమతుల్యతపై ప్రభావం చూపిందని చర్చ జరిగింది.

Also Read: జ‌పాన్‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మైన యానిమ‌ల్‌.. డేట్ కూడా ఫిక్స్‌!

సెలెక్షన్ మీటింగ్‌లో ఏం జరిగింది?

రహస్య సమావేశంలో గిల్ టీ20 సగటు, స్ట్రైక్ రేట్‌పై సుదీర్ఘ చర్చ జరిగింది. యశస్వి జైస్వాల్ వంటి ఆటగాళ్ల పేర్లు కూడా చర్చకు వచ్చాయి. యశస్వి, సంజూ శాంసన్ వంటి ప్రతిభావంతులైన ఆటగాళ్లను కాదని గిల్‌ను జట్టులో కొనసాగించాల్సిన అవసరం లేదని నిర్ణయించారు. దీంతో 2026 వరల్డ్ కప్ జట్టులో గిల్‌ను పక్కన పెట్టాలని ఫైనల్‌గా నిర్ణయం తీసుకున్నారు. 2024 వరల్డ్ కప్‌లోనూ గిల్‌కు చోటు దక్కలేదన్న విషయం తెలిసిందే.

టీ20 వరల్డ్ కప్ 2026 – భారత జట్టు

  • సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, రింకూ సింగ్.
  Last Updated: 24 Dec 2025, 08:56 PM IST