India Wins WI Series: విండీస్ పై క్లీన్ స్వీప్

వేదిక మారలేదు...ఫలితం కూడా మారలేదు...కరేబియన్ గడ్డపై మరోసారి భారత్ పూర్తి ఆధిపత్యం కనబరిచిన వేళ విండీస్ చిత్తుగా ఓడిపోయింది.

  • Written By:
  • Updated On - July 28, 2022 / 10:10 AM IST

వేదిక మారలేదు…ఫలితం కూడా మారలేదు…కరేబియన్ గడ్డపై మరోసారి భారత్ పూర్తి ఆధిపత్యం కనబరిచిన వేళ విండీస్ చిత్తుగా ఓడిపోయింది. దీంతో సిరీస్‌ను టీమ్ ఇండియా 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. బుధ‌వారం జ‌రిగిన మూడో వ‌న్డేలో 119 ప‌రుగుల తేడాతో వెస్టిండీస్‌ఫై  భార‌త జ‌ట్టు ఘ‌న విజ‌యాన్ని సాధించింది. బ్యాటింగ్ శుభ్‌మ‌న్‌ గిల్, బౌలింగ్‌లో చాహ‌ల్ రాణించారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ కు ధావ‌న్‌, శుభ్‌మ‌న్ నిల‌క‌డ‌గా ఆడుతూ శుభారంభాన్ని అందించారు. తొలి వికెట్‌కు 113 ర‌న్స్ జోడించారు. ధావ‌న్ నిదానంగా ఆడ‌గా శుభ్‌మ‌న్ ఫోర్లు, సిక్సర్ల‌తో విండీస్ బౌల‌ర్ల‌పై సంపూర్ణ ఆధిప‌త్యం చెలాయించాడు. 22వ ఓవ‌ర్ వ‌ద్ద ఈ జోడికి బ్రేక్ ప‌డింది. 74 బాల్స్ లో ఏడు ఫోర్ల‌తో 58 ర‌న్స్ చేసిన ధాన్ ఔట‌య్యాడు. ఆ త‌ర్వాత శ్రేయ‌స్‌తో క‌లిసి శుభ్‌మ‌న్ స్కోరు వేగం పెంచాడు. 34 బంతుల్లో 44 ర‌న్స్ చేసి శ్రేయ‌స్ ఔట‌య్యాడు. పలు సార్లు వర్షం అంతరాయం కలిగించింది. 36 ఓవ‌ర్ల‌లో 225 ప‌రుగులు వ‌ద్ద ఉన్న స‌మ‌యంలో భారీ వ‌ర్షం ప‌డ‌టంతో ఇండియా ఇన్నింగ్స్ ముగిసింది. 98 బాల్స్‌లో 2 సిక్స‌ర్లు, ఏడు ఫోర్ల‌తో 98 ప‌రుగులు చేసిన శుభ్‌మ‌న్ నాటౌట్‌గా నిలిచాడు. డ‌క్‌వ‌ర్త్ లూయిస్ విధానంలో 35 ఓవ‌ర్ల‌లో విండీస్ టార్గెట్‌ను 257 ర‌న్స్‌గా నిర్ణ‌యించారు.
ల‌క్ష్య‌ఛేద‌న‌లో విండీస్ ఆరంభం నుంచే త‌డ‌బ‌డింది.మేయ‌ర్స్‌, బ్రూక్స్‌ను డ‌కౌట్ చేసి విండీస్‌ను పేస‌ర్ సిరాజ్ దెబ్బ‌కొట్టాడు.
తర్వాత కెప్టెన్ నికోల‌స్ పూర‌న్‌, బ్రెండ‌న్ కింగ్ క‌లిసి విండీస్ ను గాడిన‌పెట్టే ప్ర‌య‌త్నం చేశారు. ఇద్ద‌రు ధాటిగా ఆడ‌టంతో విండీస్ కోలుకునేలా క‌నిపించింది. వీరిద్దరూ త‌క్కువ ప‌రుగుల వ్య‌వ‌ధిలో ఔటయ్యరు. ఆ తర్వాత వచ్చిన మిగిలిన బ్యాట్స్‌మెన్స్ అంద‌రూ సింగిల్ డిజిట్‌కు ప‌రిమితం కావ‌డంతో విండీస్ ఇన్నింగ్స్ 26 ఓవ‌ర్ల‌లో 137 ర‌న్స్‌కు ముగిసింది. భారత బౌల‌ర్ల‌లో చాహ‌ల్ నాలుగు, శార్దూల్ ఠాకూర్, సిరాజ్ త‌లో రెండు, అక్ష‌ర్‌ప‌టేల్‌, ప్ర‌సిద్ధ్ కృష్ణ ఒక్కో వికెట్ ద‌క్కించుకున్నారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ తో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు శుభ్‌మ‌న్‌గిల్ కు దక్కింది. ఈ విజయంతో కరెబియన్ గడ్డపై 39 ఏళ్ల తర్వాత వన్డే సిరీస్ ను భారత్ స్వీప్ చేసింది.