Site icon HashtagU Telugu

Shubman Gill: గిల్ డ‌బుల్ సెంచ‌రీ.. గంభీర్ స‌ల‌హాతోనే సాధ్య‌మైందా?

IND vs ENG

IND vs ENG

Shubman Gill: ఎడ్జ్‌బాస్టన్‌లో జరుగుతున్న భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ రెండో టెస్ట్ మ్యాచ్ రెండవ రోజు కూడా భారత్ పేరిట నమోదైంది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) రికార్డు సృష్టించిన డబుల్ సెంచరీ సాయంతో టీమ్ ఇండియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 587 పరుగులు సాధించగలిగింది. గిల్ తన 269 పరుగుల ఇన్నింగ్స్‌లో 387 బంతులను ఎదుర్కొని 30 ఫోర్లు, 3 సిక్సర్లు కొట్టాడు. అయితే ఈ ఇన్నింగ్స్ త‌ర్వాత కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో తాను కాస్త భ‌య‌ప‌డాన‌ని ఎందుకంటే బౌండరీలు కొట్టలేకపోయాడని తెలిపాడు. ఈ విషయంలో కోచ్ గౌతమ్ గంభీర్ సలహా ఇవ్వ‌టంతో ఆ సలహా గట్టెక్కించిందని చెప్పాడు.

గిల్ తన ఇన్నింగ్స్ ఆరంభంలో ఎలా ఇబ్బంది ప‌డ్డాడో, బౌండరీలు కొట్టలేకపోయాడో గుర్తు చేసుకున్నాడు. భారత కెప్టెన్ బ్రాడ్‌కాస్టర్లతో మాట్లాడుతూ.. తాను గంభీర్‌తో మాట్లాడినట్లు, ఫీల్డర్లను కనుగొంటున్నానని చెప్పినట్లు తెలిపాడు. గిల్ చెప్పిన ప్రకారం.. భారత కోచ్ తనతో ఓపిక పట్టమని, పరుగులు వస్తాయని సలహా ఇచ్చాడు.

Also Read: School: 15 సంవ‌త్స‌రాలుగా గుడిసెలోనే పాఠ‌శాల.. ప‌ట్టించుకునే నాథుడే లేడు!

నిన్న లంచ్ బ్రేక్ సమయంలో నేను మైదానంలోకి వచ్చినప్పుడు, నన్ను ఆటలో ఇన్వాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నించాను. దాదాపు 100 బంతులు ఆడిన తర్వాత టీ బ్రేక్ సమయంలో నేను 35-40 పరుగుల వద్ద ఉన్నాను. నేను డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లి జీజీ భాయ్ (గౌతమ్ గంభీర్)తో మాట్లాడాను. నేను బౌండరీలు కొట్టలేకపోతున్నానని, ఫీల్డర్లను కనుగొంటున్నానని చెప్పాను. ఆయన నాకు ఓపిక పట్టమని సలహా ఇచ్చాడ‌ని గిల్ చెప్పుకొచ్చాడు.

గౌతమ్ గంభీర్ సలహాను పాటిస్తూ.. శుభ్‌మన్ గిల్ బౌండరీలు రాకపోయినా పేల‌వ‌మైన షాట్లు ఆడలేదు. నెమ్మదిగా బౌండరీలు కూడా రావడం మొదలైంది. ఆ తర్వాత అతను ఇంగ్లీష్ బౌలర్లపై ఆధిపత్యం చెలాయించాడు. గమనించాల్సిన విషయం ఏమిటంటే.. శుభ్‌మన్ గిల్ SENA దేశాలలో డబుల్ సెంచరీ సాధించిన తొలి ఆసియా బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. అంతేకాక భారత కెప్టెన్‌గా టెస్ట్ క్రికెట్‌లో అతిపెద్ద ఇన్నింగ్స్ ఆడిన ఆటగాడిగా కూడా రికార్డు సృష్టించాడు. ఇక‌పోతే ఈ వార్త రాసే స‌మ‌యానికి ఇంగ్లాండ్ జ‌ట్టు 5 వికెట్ల న‌ష్టానికి 244 ప‌రుగులు చేసింది. భార‌త్ 343 ప‌రుగులు ఆధిక్యంలో ఉంది.

Exit mobile version