Site icon HashtagU Telugu

Shubman Gill: 35 ఏళ్ల క‌ల‌.. ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో చరిత్ర సృష్టించిన కెప్టెన్ గిల్‌, రికార్డులీవే!

IND vs ENG

IND vs ENG

Shubman Gill: మాంచెస్టర్‌లో జరుగుతున్న నాల్గవ టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) అద్భుతమైన బ్యాటింగ్‌తో అరుదైన రికార్డులను సొంతం చేసుకున్నాడు. రెండవ ఇన్నింగ్స్‌లో టీమిండియా స్కోరు జీరో వద్దే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న సమయంలో నంబర్ 4 స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన గిల్ కెప్టెన్‌గా బాధ్యతాయుతమైన శతకం సాధించి జట్టును ఆదుకున్నాడు. ఈ సెంచరీతో భారత క్రికెట్ చరిత్రలో 35 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించాడు. ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో సెంచరీ సాధించిన భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రత్యేక క్లబ్‌లో గిల్ చేరాడు.

శుభ్‌మన్ గిల్ అద్భుత ఇన్నింగ్స్

కష్టతరమైన పరిస్థితుల్లో బ్యాటింగ్‌కు వ‌చ్చిన‌ గిల్ 103 పరుగులు సాధించాడు. 1990లో సచిన్ టెండూల్కర్ ఇదే మైదానంలో టెస్ట్ సెంచరీ సాధించిన తర్వాత.. 35 సంవత్సరాల తర్వాత మాంచెస్టర్ టెస్ట్‌లో శతకం సాధించిన భారత బ్యాట్స్‌మెన్‌గా గిల్ నిలిచాడు. ఈ ఇన్నింగ్స్‌తో గిల్ అనేక రికార్డులను బద్దలు కొట్టాడు.

Also Read: UPI Transactions: రూ. 2 వేలు దాటితే జీఎస్టీ విధిస్తారా? క్లారిటీ ఇచ్చిన కేంద్రం!

రికార్డుల వర్షం కురిపించిన గిల్

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక సెంచరీలు: గిల్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో సంయుక్తంగా అత్యధిక సెంచరీలు (9) సాధించిన ఆటగాడిగా నిలిచాడు. రోహిత్ శర్మ కూడా ఈ టోర్నమెంట్‌లో 9 సెంచరీలు సాధించాడు.

విదేశీ పర్యటనలో ఒక సిరీస్‌లో 4 సెంచరీలు సాధించిన మొదటి కెప్టెన్: క్రికెట్ చరిత్రలో విదేశీ పర్యటనలో కెప్టెన్‌గా ఒక టెస్ట్ సిరీస్‌లో 4 సెంచరీలు సాధించిన మొదటి ఆటగాడిగా శుభ్‌మన్ గిల్ రికార్డు సృష్టించాడు. గతంలో సర్ డాన్ బ్రాడ్‌మన్, సునీల్ గావస్కర్ కూడా కెప్టెన్‌గా ఒక టెస్ట్ సిరీస్‌లో 4 సెంచరీలు సాధించారు. అయితే ఈ ఇద్దరు దిగ్గజాలు తమ సొంత మైదానంలో ఈ ఘనతను సాధించారు.

ఒక సిరీస్‌లో 4 సెంచరీలు సాధించిన భారత బ్యాట్స్‌మెన్: టీమిండియా తరపున గతంలో ఇద్దరు ఆటగాళ్లు (సునీల్ గావస్కర్ – రెండుసార్లు, విరాట్ కోహ్లీ – ఒకసారి) ఒక సిరీస్‌లో 4 సెంచరీలు సాధించారు. ఇప్పుడు శుభ్‌మన్ గిల్ కూడా ఈ ప్రత్యేక క్లబ్‌లో చేరాడు.

కెప్టెన్‌గా తొలి టెస్ట్ సిరీస్‌లో 4 సెంచరీలు: శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా తన మొదటి టెస్ట్ సిరీస్‌లో నాలుగు సెంచరీలు సాధించిన మొదటి ఆటగాడిగా నిలిచాడు. గతంలో ఐదుగురు ఆటగాళ్లు (వార్విక్ ఆర్మ్‌స్ట్రాంగ్, డాన్ బ్రాడ్‌మన్, గ్రెగ్ చాపెల్, విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్) కెప్టెన్‌గా తమ మొదటి సిరీస్‌లో మూడు సెంచరీలు సాధించారు.

ఇంగ్లాండ్ పర్యటనలో 700 టెస్ట్ పరుగులు: అంతేకాకుండా ఇంగ్లాండ్ పర్యటనలో 700 టెస్ట్ పరుగులు సాధించిన ఆసియా ఖండం నుంచి మొదటి బ్యాట్స్‌మెన్‌గా గిల్ నిలిచాడు.