Tilak Varma: టీమ్ ఇండియాకు సంబంధించి ఒక చేదు వార్త వెలుగులోకి వచ్చింది. న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో చివరి రెండు మ్యాచ్‌లకు (నాలుగు, ఐదవ టీ20) తిలక్ వర్మ అందుబాటులో ఉండరని తేలిపోయింది. దీనిపై బీసీసీఐ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. తిలక్ ప్రస్తుతం ఫిజికల్ ట్రైనింగ్ ప్రారంభించారని, అయితే అతను పూర్తి ఫిట్‌నెస్ సాధించడానికి మరికొంత సమయం పడుతుందని పేర్కొంది.
మరో రెండు మ్యాచ్‌లకు తిలక్ దూరం
న్యూజిలాండ్‌పై టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న ఆనందంలో ఉన్న భారత జట్టుకు ఇది పెద్ద ఎదురుదెబ్బ. గాయం కారణంగా మొదటి మూడు టీ20లకు దూరమైన తిలక్.. ఇప్పుడు మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో కూడా ఆడటం లేదు. ప్రస్తుతం అతను బెంగళూరులోని ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’లో వేగంగా కోలుకుంటున్నట్లు బోర్డు తెలిపింది.
Also Read: స్పిరిట్‌లో మెగాస్టార్.. ప్రభాస్ తండ్రిగా చిరంజీవి ఫైనల్?!
తిలక్ దూరం కావడంతో అతని స్థానంలో జట్టులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ టీ20 జట్టులోనే కొనసాగనున్నారు. ఇప్పటివరకు శ్రేయస్‌కు ఈ సిరీస్‌లో ఆడే అవకాశం దక్కలేదు. అయితే భారత్ ఇప్పటికే 3-0తో సిరీస్‌ను గెలుచుకుని తిరుగులేని ఆధిక్యంలో ఉన్నందున నాలుగో లేదా ఐదో టీ20లో శ్రేయస్‌కు అవకాశం ఇచ్చే యోచనలో మేనేజ్‌మెంట్ ఉంది. కాగా టీ20 వరల్డ్ కప్ 2026 ప్రారంభం నాటికి తిలక్ వర్మ పూర్తిగా కోలుకుంటారని బోర్డు ధీమా వ్యక్తం చేసింది.
సిరీస్ భారత్ వశం
గువహటిలో జరిగిన మూడో టీ20లో న్యూజిలాండ్‌ను 8 వికెట్ల తేడాతో మట్టికరిపించిన భారత జట్టు సిరీస్‌ను కైవసం చేసుకుంది. అభిషేక్ శర్మ, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వీరవిహారం చేయడంతో 154 పరుగుల లక్ష్యాన్ని టీమ్ ఇండియా కేవలం 10 ఓవర్లలోనే ఛేదించింది. అభిషేక్ శర్మ కేవలం 20 బంతుల్లోనే 68 పరుగులు చేయగా, సూర్యకుమార్ యాదవ్ 26 బంతుల్లో 57 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. బౌలింగ్‌లో జస్ప్రీత్ బుమ్రా మూడు వికెట్లు పడగొట్టి కివీస్ నడ్డి విరిచారు.
