ఆసియాకప్ లో పాకిస్థాన్ పై భారత తుది జట్టు ఎంపికపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ముఖ్యంగా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ను అనూహ్యంగా టీమ్ మేనేజ్ మెంట్ పక్కన పెట్టడం అందరినీ ఆశ్చర్యపరిచింది. గత కొంత కాలంగా జట్టలో వికెట్ కీపర్ గా నిలకడగా చోటు దక్కించుకుంటున్న రిషబ్ ను పాక్ తో మ్యాచ్ కు ఆడించకపోవడం ఒకరకంగా షాకే.రిషబ్ పంత్ స్థానంలో వికెట్ కీపర్‌గా దినేశ్ కార్తీక్‌ని తుది జట్టులోకి తీసుకున్నట్లు కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ సమయంలో వెల్లడించాడు. అయితే దానికి కారణాన్ని మాత్రం హిట్ మ్యాన్ చెప్పలేదు.
అయితే రోహిత్ శర్మ నిర్ణయాన్ని చాలా మంది తప్పుపడుతున్నారు. జట్టులో ఒకటి నుంచి ఏడో స్థానం వరకు జడేజా మినహా ఒక్క లెఫ్ట్ హ్యాండర్ లేడు. జట్టు సమతుల్యంగా ఉండాలంటే లెఫ్ట్, రైట్ కాంబినేషన్ చాలా ముఖ్యమన్నది అందరికీ తెలిసిన విషయమే. ఇలాంటి లాజిక్ రోహిత్ , టీమ్ మేనేజ్ మెంట్ ఎలా మరిచిపోయిందన్నది అర్థం కాని ప్రశ్న. అయితే టీ ట్వంటీ వరల్డ్ కప్ కు జట్టు కూర్పును సెట్ చేసుకునేందుకు ఇలా చేసిందన్న వాదనా వినిపిస్తోంది. ఎందుకంటే ఐపీఎల్ 15వ సీజన్ నుంచీ దినేశ్ కార్తీక్ నిలకడగా రాణిస్తున్నాడు. ఫినిషర్ రోల్ లో సత్తా చాటుతున్నాడు. అదే సమయంలో పంత్ నిర్లక్ష్యపు షాట్లు ఆడేస్తూ విమర్శలు ఎదుర్కొన్నాడు.
దీంతో పాటు వచ్చే టీ ట్వంటీ వరల్డ్ కప్ లో భారత జట్టు ఫినిషర్ ఎవరనే దానికి దినేశ్ కార్తీక్ పేరే ఎక్కువగా వినిపిస్తోంది. దీనిని పరిశీలించుకునేందుకు పంత్ ను పక్కన పెట్టారని భావిస్తున్నారు. అయితే రోహిత్ నిర్ణయంపై మిశ్రమ స్పందన వచ్చింది. పంత్ కు తుది జట్టులో చోటు లేకపోవడం చాలా ఆశ్చర్యపరిచిందని పలువురు మాజీ క్రికెటర్లు వ్యాఖ్యానించారు. కొందరు రోహిత్ నిర్ణయాన్ని విమర్శిస్తే.. మరికొందరు సమర్థించారు. మొత్తం మీద ఆసియాకప్ పూర్తయ్యేటప్పటికీ వచ్చే ప్రపంచకప్ లో తుది జట్టుపై దాదాపు క్లారిటీ వచ్చే అవకాశముంది.