GT Vs CSK: చెపాక్ లో చెన్నై ధనాధన్… గుజరాత్ టైటాన్స్ పై గ్రాండ్ విక్టరీ

ఐపీఎల్ 17వ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. టోర్నీని గ్రాండ్ ఆరంభించిన సీఎస్కే తాజాగా గుజరాత్ టైటాన్స్ ను 63 రన్స్ తేడాతో చిత్తు చేసింది. హోం గ్రౌండ్ లో మరోసారి చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు చెలరేగిపోయారు.

GT Vs CSK: ఐపీఎల్ 17వ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. టోర్నీని గ్రాండ్ ఆరంభించిన సీఎస్కే తాజాగా గుజరాత్ టైటాన్స్ ను 63 రన్స్ తేడాతో చిత్తు చేసింది. హోం గ్రౌండ్ లో మరోసారి చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు చెలరేగిపోయారు. గుజరాజ్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ సమిష్టిగా రాణించారు. శివమ్ దూబే 23 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 51 విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగగా.. రుతురాజ్ గైక్వాడ్ 36 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 46, రచిన్ రవీంద్ర 20 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 46 రన్స్ తో కీలక ఇన్నింగ్స్ ఆడారు. దూబే మెరుపు ఇన్నింగ్స్ చెన్నై జట్టులో హైలెట్ గా నిలిచింది. శివమ్ దూబే భారీ సిక్సర్లతో గుజరాత్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివర్లో సమీర్ రిజ్వి మెరుపులతో చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్లకు 206 పరుగులు చేసింది. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో రషీద్ ఖాన్ 2 వికెట్లు తీయగా.. సాయి కిషోర్, స్పెన్సర్ జాన్సన్, మోహిత్ శర్మ తలో వికెట్ తీసారు.

భారీ లక్ష్య ఛేదనలో గుజరాత్ టైటాన్స్ కు మెరుపు ఆరంభం దక్కలేదు. ఓపెనర్ శుభ్ మన్ గిల్ 8 పరుగులకే ఔటయ్యాడు. తర్వాత ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన సాయిసుదర్శన్ , సాహా ఇన్నింగ్స్ కొనసాగించినా కీలక సమయంలో వెనుదిరగడంతో గుజరాత్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది.సాయి సుదర్శన్ 37, సాహా 21 పరుగులు చేయగా… మిగిలిన బ్యాటర్లు ఎవ్వరూ చెప్పుకోదగిన ఇన్నింగ్స్ ఆడలేదు. అంచనాలు పెట్టుకున్న డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా కూడా నిరాశపరిచారు. చెన్నై పేసర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో గుజరాత్ బ్యాటర్లు భారీ షాట్లు ఆడలేకపోయారు. దీంతో గుజరాత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 143 పరుగులకే పరిమితమైంది. చెన్నై బౌలర్లలో దీపక్ చాహర్, ముస్తఫిజర్ రహమాన్, తుషార్ దేశ్ పాండ్ రెండేసి వికెట్లు తీయగా..పతిరణకు ఒక వికెట్ దక్కింది. తాజా విజయంతో చెన్నై పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ కు దూసుకెళ్ళింది.

Also Read: BRS Party: ప్రభుత్వం రైతులను ఆదుకోకుంటే ప్రజా ఉద్యమాలకు సిద్ధమవుతాం: బోయినపల్లి వినోద్