Site icon HashtagU Telugu

IND vs BAN : గాయంతో శివమ్ దూబే ఔట్..బంగ్లాతో టీ20లకు తిలక్ వర్మ

Shivam Dube

Shivam Dube

బంగ్లాదేశ్ తో మూడు మ్యాచ్ ల టీ ట్వంటీ (IND vs BAN) సిరీస్ (T20I series) కు ముందు భారత్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఆల్ రౌండర్ శివమ్ దూబే (India all-rounder Shivam Dube) గాయం (Injury) కారణంగా సిరీస్ నుంచి వైదొలిగాడు. వెన్నునొప్పితో బాధపడుతున్న దూబే స్థానంలో హైదరాబాదీ క్రికెటర్ తిలక్ వర్మ (Tilak Varma)ను బీసీసీఐ (BCCI) ఎంపిక చేసింది. త్వరలోనే తిలక్ వర్మ జట్టుతో కలుస్తాడని వెల్లడించింది. టీ ట్వంటీ ప్రపంచకప్ విన్నింగ్ టీమ్ లో ఉన్న దూబే ఇటీవల దులీప్ ట్రోఫీ తొలి రౌండ్ మ్యాచ్ లు కూడా ఆడాడు. భారత పరిమిత ఓవర్ల జట్టు ప్లాన్స్ లో ఉన్న దూబేను, పాండ్యాకు తోడుగా ఆల్ రౌండర్ కోటాలో ఎంపిక చేశారు. ప్రస్తుతం నితీశ్ కుమార్ రెడ్డి కూడా మరో ఆల్ రౌండర్ గా బంగ్లాతో సిరీస్ కు చోటు దక్కించుకున్నాడు. వెన్నునొప్పి కారణంగా ముందు జాగ్రత్తగా దూబేను తప్పించినట్టు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ దూబే స్థానంలో ఎంపికయ్యాడు. ఐపీఎల్ తో పాటు దేశవాళీ క్రికెట్ లో అదరగొడుతున్న తిలక్ వర్మ చివరిసారిగా భారత జట్టుకు ఈ ఏడాది జనవరిలో ఆడాడు. 2023లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన తిలక్ వర్మ ఇప్పటి వరకు 16 టీ ట్వంటీలు, 4 వన్డేలు ఆడాడు. టీ ట్వంటీల్లో 2 హాఫ్ సెంచరీలతో 336 పరుగులు చేసిన తిలక్ వర్మకు తుది జట్టులో చోటు దక్కడంపై సస్పెన్స్ నెలకొంది. దూబే స్థానంలో ఆల్ రౌండర్ నే తీసుకోవాలనుకుంటే విశాఖ కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డికే అవకాశమిస్తారని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే గ్వాలియర్ వేదికగా ఆదివారం భారత్, బంగ్లాదేశ్ తొలి టీ ట్వంటీ జరగనుండగా… రెండో మ్యాచ్ కు న్యూఢిల్లీ ఆతిథ్యమిస్తోంది. ఇక సిరీస్ లో చివరిదైన మూడో టీ ట్వంటీ అక్టోబర్ 12న హైదరాబాద్ లో జరుగుతుంది.

బంగ్లాదేశ్ తో సిరీస్ భారత్ టీ ట్వంటీ జట్టు (India T20 team) :

సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ ( వికెట్ కీపర్ ), రింకూసింగ్, హార్థిక్ పాండ్యా, రియాన్ పరాగ్, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్ , వరుణ్ చక్రవర్తి, జితేశ్ శర్మ ( వికెట్ కీపర్ ), అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, మయాంక్ యాదవ్, తిలక్ వర్మ

Read Also : India Vs Bangladesh : ఆరంభం అదరాల్సిందే..బంగ్లాతో తొలి టీ20కి భారత్ రెడీ