Shikhar Dhawan: అంతర్జాతీయ క్రికెట్ తో పాటు దేశవాళీ క్రికెట్ కు వీడ్కోలు పలికిన మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ మళ్ళీ బ్యాట్ పట్టనున్నాడు. రిటైర్మెంట్ ప్లేయర్స్ కోసం నిర్వహిస్తున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్ లో ధావన్ బరిలోకి దిగుతున్నాడు. ఈ విషయాన్ని లీగ్ నిర్వాహకులు ప్రకటించారు. రిటైరయిన భారత ప్లేయర్స్ ప్రపంచ క్రికెట్ లో ఏ లీగ్ లోనైనా ఆడే అవకాశముంది. దీనిలో భాగంగానే గబ్బర్ లెజెండ్స్ లీగ్ లో ఆడనున్నాడు. క్రికెట్ ఎప్పుడూ తన లైఫ్ లో ఒక భాగమని, తన పాత స్నేహితులతో కలిసి ఆడనుండడం సంతోషంగా ఉందంటూ గబ్బర్ ట్వీట్ చేశాడు.
భారత వన్డే క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఓపెనర్లలో ఒకడైన శిఖర్ ధావన్ ఇటీవలే ఆటకు గుడ్ బై చెప్పాడు. యువ క్రికెటర్ల ఎంట్రీ జాతీయ జట్టుకు దూరమైన గబ్బర్ ప్రస్తుతం ఐపీఎల్ లో మాత్రమే కొనసాగుతున్నాడు. గత ఏడాది వన్డే వరల్డ్ కప్ సమయంలోనూ ధావన్ పేరు వినిపించినా సెలక్టర్లు అతన్ని ఎంపిక చేయలేదు. 38 ఏళ్ల ధావన్ చివరిసారిగా 2022, డిసెంబరులో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డేలో భారత్ తరఫున ఆడాడు. 2010 అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టిన ఈ ఢిల్లీ క్రికెటర్ అంతర్జాతీయ క్రికెట్ లో ధావన్ 34 టెస్టులు, 167 వన్డేలు, 68 టీ ట్వంటీలు ఆడి 12 వేలకు పైగా పరుగులు చేశాడు. కాగా శిఖర్ ధావన్ కు మిస్టర్ ఐసీసీగా పేరుంది. ఎందుకంటే మెగా టోర్నీలంటే చాలు గబ్బర్ కు పూనకం వస్తుంది. సాధారణంగా వరల్డ్ కప్ , ఛాంపియన్స్ ట్రోఫీ వంటి ఐసీసీ టోర్నీల్లో నిలకడగా రాణించడం అంత ఈజీకాదు. ఒత్తిడిని తట్టుకుని ప్రపంచ స్థాయి టోర్నీల్లో మెరుగైన ప్రదర్శన కనబరచడం ఒక్కో సందర్భాల్లో దిగ్గజ ఆటగాళ్ళకే సాధ్యం కాదు.
అలాంటిది ప్రతీసారి ధావన్ ఐసీసీ టోర్నీల్లో చెలరేగిపోయాడు. వరుస శతకాలతో బౌలర్లకు చుక్కలు చూపించాడు. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ విజయంలోనూ గబ్బర్ దే కీరోల్. ఆ మెగా టోర్నీలో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడు. అలాగే 2015 వరల్డ్ కప్ లో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా నిలిచాడు. గత రెండేళ్లుగా భారత సెలెక్టర్ల పిలుపు కోసం ఎదురుచూసిన ధావన్ వీడ్కోలు మ్యాచ్ ఆడకుండానే గుడ్ బై చెప్పేశాడు. ఇదిలా ఉంటే ధావన్ ఆడబోతున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్ కొత్త సీజన్ వచ్చే నెలలో జరగబోతోంది. ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరైన క్రికెటర్లు ఈ లీగ్ లో ఆడుతున్నారు.
Also Read: Hydra Demolition: అక్రమ కట్టడాలను సమర్ధించుకుంటున్న ఒవైసీ, కావాలంటే నన్ను కాల్చేయండి