Zimbabwe Tour: రోహిత్‌, కోహ్లీతో సహా సీనియర్లకు రెస్ట్‌, జింబాబ్వే టూర్‌కు సారథిగా ధావన్‌

  • Written By:
  • Publish Date - July 31, 2022 / 05:45 AM IST

జింబాబ్వే టూర్‌కు భారత జట్టును ప్రకటించారు. అంతా ఊహించినట్టుగానే కెప్టెన్ రోహిత్‌శర్మతో సహా పలువురు సీనియర్లకు విశ్రాంతినిచ్చారు. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని జింబాబ్వే సిరీస్‌కు ఎంపిక చేస్తారని వార్తలు వచ్చినా అవి వాస్తవం కాదని తేలింది. కోహ్లీ విశ్రాంతి సమయాన్ని పొడిగిస్తూ సెలక్టర్లు నిర్ణయం తీసుకున్నారు. దీంతో కోహ్లీ ఆసియాకప్‌తోనే మళ్ళీ మైదానంలో అడుగుపెట్టనున్నాడు.

టీ ట్వంటీ వరల్డ్‌కప్‌ సమీపిస్తుండడంతో రోహిత్, కోహ్లీతో పాటు సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, హార్థిక్ పాండ్యా, బూమ్రా, మహ్మద్ షమీ, రవీంద్ర జడేజా, యాజ్వేంద్ర చాహల్‌కు విశ్రాంతినిచ్చారు. కాగా విండీస్‌ టూర్‌లో వన్డే టీమ్‌ను లీడ్ చేసిన శిఖర్ ధావన్‌నే జింబాబ్వే పర్యటనకూ సారథిగా ఎంపిక చేశారు. గాయాల నుంచి కోలుకున్న దీపక్ చాహర్, వాషింగ్టన్ సుందర్ జట్టులోకి తిరిగి వచ్చారు.

ఐపీఎల్ సమయంలో గాయపడి సీజన్ మొత్తానికి దూరమైన దీపక్ చాహర్ ఎట్టకేలకు కోలుకుని ఇప్పుడు రీ ఎంట్రీ ఇస్తున్నాడు. అలాగే కౌంటీ క్రికెట్‌లో సత్తా చాటుతున్న వాషింగ్టన్ సుందర్‌ను కూడా సెలక్టర్లు ఎంపిక చేశారు. వీరితో పాటు డాషింగ్ బ్యాటర్ రాహుల్ త్రిపాఠీకి సెలక్టర్లు పిలుపునిచ్చారు. అలాగే విండీస్ టూర్‌లో ఆడుతున్న వికెట్ కీపర్ సంజూ శాంసన్‌, హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్, ఇషాన్ కిషన్, శార్థూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, అవేశ్ ఖాన్, ప్రసిద్ధ కృష్ణ తమ చోటు నిలుపుకున్నారు. జింబాబ్వే టూర్‌లో భారత్ మూడు వన్డేలు ఆడనుంది. ఆగష్ట్ 18, 20, 22 తేదీల్లో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి.

జింబాబ్వేతో వన్డే సిరీస్‌కు భారత జట్టు ః
శిఖర్ ధావన్(కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, , దీపక్ చాహర్ , వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, అవేశ్ ఖాన్, ప్రసిధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్