India Vs South Africa T20:సఫారీలతో వన్డే సిరీస్ కు కెప్టెన్ ధావన్

ఆసియాకప్ ముగిసింది... కొన్ని రోజుల విరామం తర్వాత భారత్ స్వదేశంలో రెండు పెద్ద జట్లతో సిరీస్ కు రెడీ అవుతోంది.

  • Written By:
  • Publish Date - September 12, 2022 / 12:52 PM IST

ఆసియాకప్ ముగిసింది… కొన్ని రోజుల విరామం తర్వాత భారత్ స్వదేశంలో రెండు పెద్ద జట్లతో సిరీస్ కు రెడీ అవుతోంది. ముందు ఆస్ట్రేలియాతో టీ ట్వంటీ సిరీస్ ఆడనుండగా.. ఆ తర్వాత సౌతాఫ్రికాతో తలపడబోతోంది. అయితే దక్షిణాఫ్రికాతో జరగనున్న వన్డే సిరీస్ కు భారత కెప్టెన్ గా శిఖర్ ధావన్ బాధ్యతలు చేపట్టనున్నాడు.టీ ట్వంటీ ప్రపంచకప్ కు ముందు కీలక ఆటగాళ్ళందరికీ విశ్రాంతినివ్వాలని బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

రోహిత్ శర్మ , కోహ్లీతో పాటు కెఎల్ రాహుల్ వంటి స్టార్ ప్లేయర్స్ అందరూ ఈ సిరీస్ కు దూరం కానున్నారు. అలాగే హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ స్థానంలో తాత్కాలిక కోచ్ గా వీవీఎస్ లక్ష్మణ్ వ్యవహరించనున్నాడు. నిజానికి ఈ వన్డే సిరీస్ ముగిసిన ఆరు రోజుల్లోనే భారత్, ఆస్ట్రేలియాలో వార్మప్ మ్యాచ్ లు ఆడాల్సి ఉంటుంది. అందుకే ప్రధాన ఆటగాళ్ళందరికీ విశ్రాంతినిచ్చి ముందుగానే ఆసీస్ కు పంపించాలని బీసీసీఐ భావిస్తోంది.

దీనిలో భాగంగానే ధావన్ కు కెప్టెన్సీ అప్పగించనుంది. ఇప్పటికే విండీస్, జింజాబ్వే టూర్ లలో ధావన్ భారత కెప్టెన్ గా వ్యవహరించాడు. ఈ వన్డే సిరీస్ కు రాహుల్ త్రిపాఠీ, ఉమ్రాన్ మాలిక్ వంటి యువ ఆటగాళ్ళకు చోటు దక్కనుంది. కాగా ఇప్పటికే సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు తమ టీమ్ ను ప్రకటించింది. భారత్ టూర్ వచ్చే సఫారీ జట్టు కెప్టెన్ గా బవుమా సారథ్యం వహించనుండగా… డికాక్, మిల్లర్, రబాడా వంటి స్టార్ ప్లేయర్స్ కూడా ఉన్నారు. సౌతాఫ్రికాతో మూడు టీ ట్వంటీల సిరీస్ సెప్టెంబర్ 28 నుంచి ఆరంభం కానుండగా.. వన్డే సిరీస్ అక్టోబర్ 6 నుంచి మొదలు కానుంది. తొలి వన్డేకు లక్నో, రెండో వన్డేకు రాంఛీ, మూడో వన్డేకు ఢిల్లీ ఆతిథ్యమివ్వనున్నాయి.