Ind vs WI: ఉత్కంఠ పోరులో భారత్ విజయం

వెస్టిండీస్ టూర్ ను భారత్ విజయంతో ఆరంభించింది. చివరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో ధావన్ సేన 3 పరుగుల తేడాతో విజయం సాధించింది.

  • Written By:
  • Publish Date - July 23, 2022 / 10:24 AM IST

వెస్టిండీస్ టూర్ ను భారత్ విజయంతో ఆరంభించింది. చివరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో ధావన్ సేన 3 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో భారత్ ను విండీస్ బాగానే టెన్షన్ పెట్టింది. భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆఖరి బంతి వరకూ మ్యాచ్ ను తీసుకొచ్చింది. చివరి ఓవర్లో హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ ఒత్తిడిని తట్టుకుని 11 రన్స్ ఇవ్వడంతో భారత్ విజయాన్ని అందుకుంది.

మొదట బ్యాటింగ్ కు దిగిన భారత్ భారీ స్కోరు చేసింది. సీనియర్లు లేకున్నా యువ బ్యాటర్లు అదరగొట్టారు. తొలి వికెట్ కు ఓపెనర్లు శిఖర్ ధావన్, శుబ్ మన్ గిల్ 119 పరుగులు జోడించారు. గిల్ 64 రన్స్ చేయగా…చాలా కాలం తర్వాత ఫామ్ లోకి వచ్చిన ధావన్ మూడు పరుగుల తేడాతో సెంచరీని కోల్పోయాడు. గబ్బర్
99 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 97 రన్స్ చేశాడు. తర్వాత శ్రేయస్‌ అయ్యర్‌ 57 బంతుల్లో 54 ధాటిగా ఆడగా… చివర్లో భారత్ వరుస వికెట్లు కోల్పోయింది. సూర్యకుమార్‌ , సంజూ విఫలమవడంతో ఆఖర్లో ఆశించినంత వేగంగా పరుగులు రాలేదు. దీంతో 350 కి పైగా స్కోర్ చేస్తుందనుకున్న భారత్ 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 308 పరుగులే చేసింది. అల్జారీ జోసెఫ్, గుడకేశ్‌ మోతీ చెరో 2 వికెట్లు తీశారు.

309 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో వెస్టిండీస్‌ కు సరైన ఆరంభం దక్కలేదు. ఓపెనర్ షాయ్ హోప్ త్వరగానే ఔటయ్యాడు. అయితే బ్రూక్స్‌తో కలిసి మరో ఓపెనర్ కైల్ మేయర్స్ ఇన్నింగ్స్‌ నడిపించారు. వీరిద్దరూ చాలా సేపు వికెట్ల పతనాన్ని నిలువరించారు. వీరిద్దరూ ఔటయ్యాక బ్రెండన్ కింగ్ హాఫ్ సెంచరీ చేశాడు. ఈ దశలో భారత్ బౌలర్లు పుంజుకుని వరుస వికెట్లు పడగొట్టారు. దీంతో టీమిండియా గెలుపు లాంఛనమే అనిపించింది.

లోయర్ ఆర్డర్ బ్యాటర్లు రొమారియో షెపర్డ్. అకీల్ హోసీన్ జట్టు విజయం వరకు తీసుకొచ్చారు. వీరిద్దరూ చాలా సేపు టీమిండియా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ముఖ్యంగా షెపర్డ్ బౌండరీలు, సిక్సర్లతో వేగంగా ఆడీ.. భారత అభిమానుల్లో కలవరం పెట్టాడు. చివరి ఓవర్లో 15 పరుగులు అవసరమైన సమయంలో సిరాజ్ 11 పరుగులే ఇవ్వడంతో ఓటమి నుంచి భారత్ తప్పించుకుంది. భారత బౌలర్లలో మహ్మద్‌ సిరాజ్‌, శార్దూల్‌ ఠాకూర్‌, చహల్‌ ముగ్గురూ కూడా రెండేసి వికెట్లు తీశారు. ధావన్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. మూడు వన్డేల సిరీస్ లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలవగా…రెండో మ్యాచ్ ఇదే వేదికపై బుధవారం జరుగుతుంది.