Site icon HashtagU Telugu

Shikhar Dhawan: గబ్బర్ అరుదైన రికార్డు

Gill Dhawan

Gill Dhawan

వన్డే క్రికెట్‌లో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ జోరు కొనసాగుతోంది. జింబాబ్వేతో తొలి వన్డేలో హాఫ్ సెంచరీతో మెరిసిన ధావన్ అరుదైన మైలురాయి అందుకున్నాడు. వన్డేల్లో 6500 పరుగుల మైలు రాయిని అందుకున్న పదో భారత బ్యాటర్‌గా ధావన్‌ రికార్డులకెక్కాడు.

ఈ మ్యాచ్‌లో 81 పరుగులతో అజేయంగా నిలిచిన గబ్బర్‌ భారత జట్టును గెలిపించాడు. గతంలో 6500 మైలురాయి అందుకున్న వారిలో సచిన్ , కోహ్లీ, గంగూలీ, ద్రావిడ్, ధోనీ, అజారుద్దీన్, రోహిత్ శర్మ, యువరాజ్‌సింగ్, సెహ్వాగ్ ఉన్నారు. ధావన్ 156వ మ్యాచ్‌లో ఈ రికార్డు సాధించాడు. వన్డేల్లో అత్యధిక పరుగుల జాబితాకు సంబంధించి సచిన్ 18 వేల 426 రన్స్‌తో అగ్రస్థానంలో కొనసాగుతుండగా…కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో ధావన్ 10వ స్థానంలో కొనసాగుతున్నాడు. జింబాబ్వేతో తొలి వన్డేలో ధావన్ 81 పరుగులు చేయగా.. కెరీర్‌లో 38వ హాఫ్ సెంచరీ సాధించాడు. ఇదిలా ఉంటే గత కొంత కాలంగా జట్టులో చోటు కోల్పోయిన ధావన్ ఇటీవల మళ్ళీ రీఎంట్రీ ఇచ్చాడు. పునరాగమనంలో నిలకడగా రాణిస్తూ వచ్చే ప్రపంచకప్ ఆడేలా టార్గెట్ పెట్టుకున్నాడు.
ప్రస్తుతం ఈ వెటరన్ ఓపెనర్‌ను సెలక్టర్లు టీ ట్వంటీలకు పరిగణలోకి తీసుకోవడం లేదు. దీనిపైనే ఇటీవల స్పందించిన గబ్బర్ తనను షార్ట్ ఫార్మేట్‌కు ఎందుకు ఎంపిక చేయడం లేదో అర్థం కావడం లేదన్నాడు. అయితే 2023 వన్డే వరల్డ్ కప్‌ ఆడడమే లక్ష్యమని చెప్పాడు. కాగా తొలి వన్డేలో భారత్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. భారత బౌలర్ల ధాటికి జింబాబ్వే 189 పరుగులకే కుప్పకూలింది. తర్వాత 190 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ వికెట్‌ నష్టపోకుండా చేధించింది.
ఇటీవల బంగ్లాదేశ్‌ను ఓడించిన ఆతిథ్య జట్టు భారత్‌కు ఏమాత్రం పోటీనివ్వలేకపోయింది. సిరీస్‌లో రెండో వన్డే శనివారం హరారే వేదికగానే జరుగుతుంది.

Exit mobile version