India A team: చెలరేగిన శార్థూల్,కుల్దీప్‌సేన్…భారత్‌ ఎ విజయం

సొంతగడ్డపై భారత యువ జట్టు అదరగొడుతోంది. న్యూజిలాండ్‌ ఎతో జరుగుతున్న వన్డే సిరీస్ తొలి మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

  • Written By:
  • Updated On - September 23, 2022 / 08:35 AM IST

సొంతగడ్డపై భారత యువ జట్టు అదరగొడుతోంది. న్యూజిలాండ్‌ ఎతో జరుగుతున్న వన్డే సిరీస్ తొలి మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
యువ బౌలర్లు పూర్తి ఆధిపత్యం కనబరిచిన వేళ న్యూజిలాండ్ ఎ కేవలం 167 పరుగులకే కుప్పకూలింది. టాపార్డర్‌లో ఏ ఒక్కరినీ క్రీజులో కుదురుకోనివ్వకుండా కివీస్‌ను దెబ్బతీశారు. యువ పేసర్లు శార్థూల్ ఠాకూర్, కుల్దీప్ సేన్ తమ పేస్‌తో కివీస్‌ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. చివర్లో రిప్పోన్ 61 , జో వాకర్ 36 పరుగులతో పోరాడకుంటే కివీస్ స్కోర్ 100 కూడా దాటేది కాదు. భారత్ ఎ బౌలర్లలో శార్థూల్ ఠాకూర్ 4 , కుల్దీప్ సేన్ 3 , కుల్దీప్ యాదవ్ 1 వికెట్ పడగొట్టారు. 168 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టులో రుతురాజ్ గైక్వాడ్ , రాహుల్ త్రిపాఠీ రాణించారు. పృథ్వీ షా 17 రన్స్‌కే ఔటైనప్పటకీ.. వీరిద్దరూ రెండో వికెట్‌కు 56 పరుగులు జోడించారు. గైక్వాడ్ 41 , రాహుల్ త్రిపాఠి 31 పరుగులకు చేయగా.. తర్వాత సంజూ శాంసన్‌, రజత్ పాటిదార్ జట్టు విజయాన్ని పూర్తి చేశారు. సంజూ 29 , పటిదార్ 45 పరుగులతో అజేయంగా నిలిచారు. దీంతో భారత్ ఎ జట్టు 31.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ ఎ 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండు జట్ల మధ్య జరిగిన అనధికార టెస్ట్ సిరీస్‌లో భారత్ ఎ 1-0 తో విజయం సాధించింది. వన్డే సిరీస్‌లో రెండో మ్యాచ్ ఆదివారం చెన్నైలోనే జరుగుతుంది.