Site icon HashtagU Telugu

Shakib Al Hasan : బంగ్లాదేశ్ క్రికెట్ కు ఎదురుదెబ్బ, షకీబ్ అల్ హసన్ కెరీర్ ముగిసినట్టేనా ?

Bangladesh Shakib Al Hasan

Bangladesh Shakib Al Hasan

బంగ్లాదేశ్ (Bangladesh ) మాజీ కెప్టెన్, ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ (Shakib Al Hasan) పై ఐసీసీ (ICC) సంచలన నిర్ణయం తీసుకుంది. అతడిపై ఐసీసీ లైఫ్ టైం వేటు వేసింది. ఫలితంగా షకీబ్ అల్ హసన్ ఇకపై అంతర్జాతీయ క్రికెట్‌లో బౌలింగ్ చేసే అవకాశం లేదు. అంతర్జాతీయ కెరీర్ చివరి దశలో ఉన్న షకీబ్‌కు ఇది ఎదురు దెబ్బ అనే చెప్పాలి. ఈ నిషేధం తర్వాత అతని కెరీర్ కూడా ముగిసిపోయే ప్రమాదముంది.

షకీబ్ అల్ హసన్ ఇటీవల ఇంగ్లాండ్‌లో సర్రే తరపున ఆడాడు. అక్కడ అతని బౌలింగ్ యాక్షన్ అనుమానాస్పదంగా కనిపించింది. ఈ విషయం గురించి సమాచారం అందుకున్న ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు అతనిని విచారించింది. అతని తప్పును గ్రహించి ఐసిసి నిబంధనల ప్రకారం మొదట ఇంగ్లాండ్‌లో తరువాత అంతర్జాతీయ క్రికెట్‌లో బౌలింగ్ చేయకుండా నిషేధించింది. ఈసీబీ ఈ నిర్ణయం గురించి మొదట బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకి తెలియజేసింది. ఆ తర్వాత షకీబ్‌పై నిషేధాన్ని బహిరంగపరిచింది. నిషేధం తర్వాత షకీబ్ అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు బంగ్లాదేశ్ వెలుపల ఏ దేశవాళీ టోర్నీలో బౌలింగ్ చేయలేడు.

ఇటీవల బంగ్లాదేశ్‌లో హింసాకాండ తర్వాత అధికార మార్పిడి జరిగింది. షకీబ్ మాజీ ప్రధాని షేక్ హసీనా పార్టీకి చెందిన ఎంపీ అన్న విషయం తెలిసిందే. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత బంగ్లాదేశ్ కోర్టులలో షకీబ్‌పై డజన్ల కొద్దీ క్రిమినల్ కేసులు నమోదయ్యాయి మరియు దేశంలో అతని భద్రతకు ముప్పు ఉంది. దీంతో షకీబ్ ప్రస్తుతం దేశం వెలుపల ఉన్నాడు. జాతీయ జట్టుకు కూడా దూరంగా ఉంచారు.

షకీబ్ అల్ హసన్ ప్రపంచంలోని గొప్ప ఆల్ రౌండర్. బంగ్లాదేశ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన క్రికెటర్ కూడా. దేశంలో క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్లడంలో అతని సహకారం ఉంది. 2006లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన ఈ 37 ఏళ్ల ఆటగాడు 71 టెస్టులు, 247 వన్డేలు, 129 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టులో 5 సెంచరీలతో సహా 4609 పరుగులు మరియు 246 వికెట్లు తీసుకున్నాడు. వన్డేల్లో 7570 పరుగులు మరియు 9 సెంచరీలతో సహా 317 వికెట్లు పడగొట్టాడు. ఇక టి20లో 2745 పరుగులు మరియు 149 వికెట్లు తీసుకున్నాడు. మొత్తం మీద షకీబ్ అల్ హసన్ 712 అంతర్జాతీయ వికెట్లు తీశాడు.

Read Also : KTR : ఆర్థిక మంత్రి ప్రకటనలు తెలంగాణ అసెంబ్లీని, ప్రజలను తప్పుదారి పట్టించాయి