World Cup 2023: ఇదేం తీరు… పాక్ క్రికెట్ బోర్డు తీరుపై విమర్శలు

వచ్చే ప్రపంచకప్‌లో భారత్‌తో మ్యాచ్‌కు సంబంధించి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అనుసరిస్తున్న వైఖరి మొదటి నుంచీ చర్చనీయాంశంగానే ఉంది

World Cup 2023: వచ్చే ప్రపంచకప్‌లో భారత్‌తో మ్యాచ్‌కు సంబంధించి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అనుసరిస్తున్న వైఖరి మొదటి నుంచీ చర్చనీయాంశంగానే ఉంది. ఆసియాకప్‌తో ముడిపెట్టి డ్రామా చేద్దామనుకున్న పీసీబీకి ఆసియా క్రికెట్ కౌన్సిల్, ఐసీసీ షాకిచ్చాయి. చివరికి హైబ్రిడ్ మోడల్‌ను కొన్ని మార్పులతో భారత్ అంగీకరించడంతో ఆసియా కప్ వేదికపై సస్పెన్స్‌ తొలగిపోయింది. అయితే ఆసియాకప్ విషయంలో బీసీసీఐ కఠినంగా వ్యవహరించడంతో తమ మాట నెగ్గించుకోలేకపోయిన పాక్ క్రికెట్ బోర్డు ఇప్పుడు డ్రామాకు తెరతీసింది. వన్డే ప్రపంచకప్‌లో ఆడడంపై ఇంకా నిర్ణయించుకోలేదంటూ పీసీబీ ఛైర్మన్ నజామ్ సేథి యూటర్న్ తీసుకున్నాడు. తమ ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సి ఉంటుందంటూ కొత్త పల్లవి అందుకున్నాడు. నజామ్ సేథీ కామెంట్స్‌తో వరల్డ్‌కప్‌లో పాక్ ఆడడంపై మళ్ళీ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. నిజానికి ఆసియాకప్‌ విషయంలో భారత్‌ అనుసరించిన వైఖరికి నిరసనగానే పాక్ బోర్డు ఇప్పుడు ఇలా వ్యవహరిస్తోందని సమాచారం.

నజామ్ సేథీ కామెంట్స్ చూస్తే ఈ విషయం స్పష్టంగా తెలిసిపోతోంది. భారత్, పాక్‌ ఎలాంటి నిర్ణయమైనా సొంతం తీసుకోలేవని, ఇరు దేశాల ప్రభుత్వాలతోనే ముడిపడి ఉంటాయన్నాడు. భారత్ ఇక్కడికి రావాలన్నా… తాము భారత్ వెళ్ళాలన్నా ప్రభుత్వాలదే తుది నిర్ణయమని చెప్పుకొచ్చాడు. ఇదే విషయాన్ని ఐసీసీకి కూడా తాము చెప్పామంటూ వ్యాఖ్యానించాడు. భద్రతకు సంబంధించి పూర్తి సంతృప్తి చెందిన తర్వాత ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి నడుచుకుంటామని చెప్పుకొచ్చాడు. ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే తాము అక్కడ ఎలా ఆడతామంటూ ఎదురు ప్రశ్నించాడు. అది డిసైడ్ అయ్యాక వేదికలపై మాట్లాడతామని చెప్పాడు. దీంతో క్రికెట్ అభిమానులు పీసీబీ తీరుపై మండిపడుతున్నారు. రోజుకో మాట చెబితే ఎలా అంటూ ఫైర్ అవుతున్నారు.

అటు పాక్ మాజీ క్రికెటర్లు సైతం పీసీబీ చీఫ్ వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఐసీసీ టోర్నీ ఎక్కడ జరిగినా ఆడాల్సిందేనని, అయితే భద్రతకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేయడం కొత్తేమీ కాదంటూ చెబుతున్నారు. కాగా భారత్‌తో మ్యాచ్‌ అహ్మదాబాద్‌లో ఆడలేమంటూ పీసీబీ చెప్పడంపై ఆ దేశ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిది తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. అహ్మదాబాద్‌లో ఆడేందుకు మీకు వచ్చిన సమస్య ఏంటంటూ పీసీబీని ప్రశ్నించాడు. అహ్మదాబాద్‌లో భారత్‌పై గెలిస్తే అంతకుమించిన మజా ఏముంటుందని అఫ్రిది వ్యాఖ్యానించాడు. మొత్తం మీద రోజుకో మాట చెబుతూ డ్రామా చేస్తున్న పాక్ క్రికెట్ బోర్డు తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Read More: Drunk On Liquor: మ‌ద్యం మ‌త్తులో భ‌లే దొరికేశాడు.. 30ఏళ్ల నాటి హ‌త్య వివ‌రాలు బ‌య‌ట‌పెట్టిన వ్య‌క్తి