Site icon HashtagU Telugu

Shafali Verma Record: షెఫాలీ రికార్డుల మోత

Shafali Varma

Shafali Varma

మహిళల టీ ట్వంటీ క్రికెట్ లో భారత ఓపెనర్ షెఫాలీ వర్మ రికార్డుల మోత మోగిస్తోంది. మహిళల జట్టులో సెహ్వాగ్ గా పేరు తెచ్చుకున్న షెఫాలీ మెరుపు ఇన్నింగ్స్ లతో అదరగొడుతోంది. తాజాగా ఆసియాకప్ లో దుమ్ము రేపుతున్న షెఫాలీ అరుదైన రికార్డులను అందుకుంది. బంగ్లాదేశ్‌తో ఇవాళ జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ రికార్డులు నెలకొల్పింది. ఈ మ్యాచ్‌లో షెఫాలీ 44 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 55 పరుగులు చేసింది. ఈ క్రమంలో అంతర్జాతీయ టీ ట్వంటీ క్రికెట్ లో 1000 పరుగులు పూర్తి చేసిన అత్యంత పిన్న వయస్కురాలిగా సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ రికార్డు గతంలో టీమిండియాకే చెందిన జెమీమా రోడ్రిగ్స్‌ పేరిట ఉండేది.

రోడ్రిగ్స్‌ 21 ఏళ్ల 32 రోజుల వయసులో 1000 పరుగుల మైలురాయిని అందుకోగా.. షెఫాలీ 18 ఏళ్ల 253 రోజుల వయసులో ఆ రికార్డును అధిగమించింది. అలాగే షెఫాలీ ఇదే మ్యాచ్‌లో మరో రికార్డు కూడా అందుకుంది. టీ20 అరంగేట్రం తర్వాత వేగంగా 1000 పరుగుల మైలురాయిని చేరుకున్న మహిళా క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కింది. షెఫాలీ 3 ఏళ్ల 14 రోజుల్లో ఈ మైలురాయిని చేరుకోగా.. గతంలో ఆసీస్‌ కెప్టెన్‌ మెగ్‌ లాన్నింగ్‌ 3 ఏళ్ల 87 రోజుల్లో ఈ మైలురాయిని అందుకుంది. పై రెండు రికార్డులతో పాటు షెఫాలీ ఈ మ్యాచ్‌లో మరో రికార్డును సైతం తన ఖాతాలో వేసుకుంది. టీ20ల్లో బంతుల పరంగా 1000 పరుగుల పూర్తి చేసిన మహిళా క్రికెటర్‌గానూ రికార్డ్ నెలకొల్పింది. షెఫాలీ 1000 పరుగులను కేవలం 735 బంతుల్లోనే పూర్తి చేసి, మరే మహిళా క్రికెటర్‌కు సాధ్యం కాని రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్ లో భారత్ 59 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ ను చిత్తు చేసింది.

Exit mobile version