Site icon HashtagU Telugu

U19WC 2022: భారత అండర్ 19 జట్టుకు అవమానం

U19 world cup

U19 world cup

అండర్ 19 ప్రపంచ కప్ ను గెలుచుకున్న యువ భారత జట్టుకు సంబందించి పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. టోర్నీ ఆరంభానికి ముందు భార‌త యువ జ‌ట్టుకు ఘోర అవమానం జరిగింది. కరోనా వ్యాక్సిన్ సర్టిఫికెట్ లేదనే కారణంతో వారిని కరేబియన్ గడ్డపై అడుగుపెట్టనివ్వలేదు. కరోనా వ్యాక్సిన్ సర్టిఫికెట్ లేకపోవడంతో ఏడుగురు భార‌త క్రికెటర్ల‌ను పోర్ట్ ఆఫ్ స్పెయిన్ ఎయిర్ పోర్టు అధికారులు నిలిపివేశారు. ఒకరోజుంతా వారిని తమ అధీనంలోనే ఉంచుకున్నారని జ‌ట్టు మేనేజ‌ర్ లోబ్జాంగ్ జీ టెన్జింగ్ వెల్ల‌డించాడు. జట్టులోని ఏడుగురిలో ర‌వికుమార్‌, ర‌ఘువంశీని తిరిగి భార‌త్‌కు వెళ్లిపోవాలని ఇమిగ్రేష‌న్ అధికారులు హెచ్చరించార‌ు.

భార‌త ప్రభుత్వ అనుమతి వచ్చేవరకూ వారిని క‌రీబియ‌న్ గ‌డ్డ‌పై అడుగుపెట్టనిచ్చేది లేదని అన్నారు. భార‌త్‌లో టీనేజీ కుర్రాళ్లకి వ్యాక్సినేషన్ ప్ర‌క్రియ‌ ఇంకా ప్రారంభించలేదని వివరణ ఇచ్చినప్పటికీ కూడా ఆటగాళ్లను ఇమిగ్రేషన్ అధికారులకు అనుమతించలేదని చెప్పారు. ఆ ఏడుగురిని త‌ర్వాతి ఫ్లయిట్‌లో ఇండియాకి తిరిగి పంపిచేస్తామంటూ బెదిరించారని టెన్జింగ్ పేర్కొన్నాడు. 24 గంట‌ల త‌ర్వాత‌ ఐసీసీ, బీసీసీఐ జోక్యం చేసుకోవడంతో ఆట‌గాళ్లు మ్యాచ్ వేదిక నుంచి గ‌యానాకు చేరుకున్నార‌ని తెలిపాడు. ఈ విషయాన్ని అప్పుడు మీడియాకు వెల్లడించలేదనీ చెప్పుకొచ్చారు. జట్టులోని యువ ఆటగాళ్లు అక్కడి పరిస్థితిపై ఇబ్బంది పడినా…తర్వాత ఐసీసీ , బీసీసీఐ జోక్యంతో అంతా సర్దుకుందనీ గుర్తు చేసుకున్నారు. కరేబియన్ గడ్డ పై జరిగిన అండర్ 19 ప్రపంచ కప్ లో భారత్ ఇంగ్లండ్ ను ఓడించి టైటిల్ గెలుచుకుంది.