India vs Australia ODI: చెపాక్ లో చెక్ ఎవరికో? సిరీస్ డిసైడర్ కు భారత్, ఆసీస్ రెడీ

భారత్, ఆస్ట్రేలియా వన్డే సిరీస్ తుది అంకానికి చేరింది. సిరీస్ ఫలితాన్ని తేల్చనున్న చివరి మ్యాచ్ చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా బుధవారం జరగనుంది.

  • Written By:
  • Updated On - March 21, 2023 / 04:13 PM IST

భారత్, ఆస్ట్రేలియా వన్డే సిరీస్ తుది అంకానికి చేరింది. సిరీస్ ఫలితాన్ని తేల్చనున్న చివరి మ్యాచ్ చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా బుధవారం జరగనుంది. తొలి వన్డేలో భారత్ (India) గెలిస్తే.. రెండో వన్డేలో ఆసీస్ రోహిత్ సేనను చిత్తు చేసింది. గత మ్యాచ్ లో భారత్ ఆటతీరు గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. అసలు ఏమాత్రం పోటీ ఇవ్వకుండా చేతులెత్తేయడంతో అభిమానులు తీవ్రనిరాశకు గురయ్యారు. ఆసీస్ పేస్ బౌలర్ స్టార్క్ దెబ్బకు ప్రధాన బ్యాటర్లు ఎవ్వరూ కూడా క్రీజులో నిలవలేకపోయారు.

కోహ్లీ, చివర్లో అక్షర్ పటేల్ ఆడకుంటే స్కోర్ కనీసం 100 కూడా దాటేది కాదు. దీంతో బ్యాటింగ్ వైఫల్యమే భారత్ (India) కు ఆందోళన కలిగిస్తోంది. తొలి మ్యాచ్ లో బౌలర్లు అదరగొట్టి ఆసీస్ ను 188 పరుగులకే కట్టడి చేసినా.. ఆ స్వల్ప టార్గెట్ ను ఛేదించేందుకు కూడా టీమండియా కాస్త చెమటోడ్చింది. టాపార్డర్ లో ఒక్కరూ స్థాయికి తగినట్టు ఆడలేదు. కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీతో రాణించకుంటే పరిస్థితి మరోలా ఉండేది. ఇప్పుడు చెపాక్ స్టేడియం వేదికగా జరగనున్న మ్యాచ్ లో భారత బ్యాటింగ్ పైనే సిరీస్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. రోహిత్ శర్మ, గిల్ , కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, కెఎల్ రాహుల్ వీరంతా పూర్తి ఫామ్ లోకి రాకుంటే భారీస్కోరు చేయడం కష్టమే.

అంచనాలు పెట్టుకున్న కోహ్లీ సైతం నిరాశపరుస్తుండడం టీమ్ మేనేజ్ మెంట్ కు ఇబ్బంది మారింది. అలాగే టీ ట్వంటీల్లో చెలరేగిపోతున్న సూర్యకుమార్ యాదవ్ వన్డేల్లో మాత్రం తన బ్యాటింగ్ సత్తా చూపలేకపోతున్నాడు. సూర్యకుమార్ నుంచి అభిమానులు పెద్ద ఇన్నింగ్స్ కోరుకుంటున్నారు. అయితే రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ చివర్లో మెరుపులు మెరిపిస్తుండడం అడ్వాంటేజ్. అటు బౌలింగ్ లో సిరాజ్ , షమీలపైనే పేస్ భారం పడనుండగా.. పాండ్యా కూడా పొదుపుగానే బౌలింగ్ చేస్తున్నాడు. ఇక స్పిన్ విభాగంలో ఆల్ రౌండర్ జడేజాకు తోడు అక్షర్ పటేల్, కుల్ దీప్ యాదవ్ లే కొనసాగే అవకాశాలున్నాయి. మరోవైపు టెస్ట్ సిరీస్ తరహాలోనే సిరీస్ మధ్యలో పుంజుకున్న ఆసీస్ భారత్ టూర్ ను విజయంతో ముగించాలని పట్టుదలగా ఉంది.

విశాఖ వన్డేలో పూర్తి ఆధిపత్యం కనబరిచిన కంగారూలు మరోసారి అలాంటి ప్రదర్శనే రిపీట్ చేయాలని ఎదురుచూస్తున్నారు. బ్యాటింగ్ లో మిఛెల్ మార్ష్ , ట్రావిడ్ హెడ్ మంచి ఫామ్ లో ఉన్నారు. అలాగే ఆసీస్ పేస్ ఎటాక్ సూపర్ ఫామ్ లో ఉంది. తొలి వన్డేతో పాటు రెండో మ్యాచ్ లోనూ ఆసీస్ పేసర్లు సత్తా చాటారు. ముఖ్యంగా విశాఖలో అసలు భారత బ్యాటర్లకు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా పూర్తి డామినేట్ చేసిన ఆసీస్ స్టార్ పేసర్ స్టార్క్ చెన్నైలోనూ చెలరేగాలని ఉవ్విళ్ళూరుతున్నాడు. అయితే చెన్నై పిచ్ సాధారణంగా స్పిన్నర్లకు అనుకూలిస్తుంటుంది. ఈ పిచ్ పై ఛేజింగ్ చేయడం కాస్త ఇబ్బందే. చివరిసారిగా ఇక్కడ 2019లో భారత్ విండీస్ తో వన్డే ఆడింది. అనూహ్యంగా సెకండాఫ్ లో పిచ్ ఔట్ ఫీల్డ్ ఫాస్ట్ గా ఉండడంతో 288 పరుగుల టార్గెట్ ను అప్పుడు విండీస్ ఛేజ్ చేసింది. ఈ సారి మాత్రం స్పిన్ పిచ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ పిచ్ పై భారత్ ఇప్పటివరకూ 13 వన్డేలు ఆడగా.. ఏడింటిలో గెలిచి 5 మ్యాచ్ లలో పరాజయం పాలైంది.

Also Read:  April 1 Coming: ఆ లోపు పూర్తి చేయాల్సిన ముఖ్యమైన ఆర్థిక పనులివే