Serena Williams:రిటైర్మెంట్ హింట్ ఇచ్చిన సెరెనా

మాజీ వరల్డ్ నెంబర్ వన్ సెరెనా విలియమ్స్ ఆటకు వీడ్కోలు పలకబోతోందా... తాజాగా ఆమె చేసిన కామెంట్స్ చూస్తే అవుననే అనిపిస్తోంది.

  • Written By:
  • Publish Date - August 10, 2022 / 01:43 PM IST

మాజీ వరల్డ్ నెంబర్ వన్ సెరెనా విలియమ్స్ ఆటకు వీడ్కోలు పలకబోతోందా… తాజాగా ఆమె చేసిన కామెంట్స్ చూస్తే అవుననే అనిపిస్తోంది. తాను క్రమంగా టెన్నిస్ నుంచి దూరంగా జరుగుతున్నానంటూ సెరెనా వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ఆమె చేసిన ఈ కామెంట్స్ అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారాయి.
సెరెనా విలియమ్స్…ఎన్నో ఏళ్ళు పాటు టెన్నిస్ ను డామినేట్ చేసిన అమెరికా నల్లకలువ… ఆమె సాధించని విజయాలు లేవు.. అందుకోని రికార్డులు లేవు..అయితే గత కొంత కాలంగా సెరెనా మునుపటి తరహాలో ఆడలేకపోతోంది. ఇందులో పెద్ద ఆశ్చర్యం కూడా ఏమీ లేదు. ఎందుకంటే ఆమె వయసు 40… బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత అడపా దడపా రాణించినా మేజర్ విజయాలు మాత్రం అందుకున్నది లేదు.

రిటైర్మెంట్ ప్రకటించకున్నా మధ్య మధ్యలో బ్రేక్ తీసుకుంటూ ఎంపిక చేసుకున్న టోర్నీలు ఆడుతోంది. తాజాగా ఆమె ఆటకు వీడ్కోలు పలికే సమయం దగ్గర పడినట్టు అర్థమవుతోంది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ సెరెనా రిటైర్మెంట్ వార్తలకు బలాన్నిస్తున్నాయి. వోగ్‌ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన రిటైర్మెంట్‌పై సెరెనా స్పందించింది. తాను క్రమంగా టెన్నిస్ నుంచి దూరంగా జరుగుతున్నానంటూ సెరెనా వ్యాఖ్యానించింది.టెన్నిస్‌కు ఏడాది పాటు దూరంగా ఉండి ఈసారి వింబుల్డన్‌కు తిరిగొచ్చిన ఆమె.. తాజాగా ఓ సింగిల్స్ మ్యాచ్‌ ఆడింది. టొరంటో ఓపెన్‌లో భాగంగా తొలి రౌండ్‌లో స్పెయిన్‌కు చెందిన నూరియా పారిజాస్‌పై గెలిచిన రెండో రౌండ్‌లో అడుగుపెట్టింది. అయితే ఈ ఏడాది జరగబోయే యూఎస్‌ ఓపెనే తన కెరీర్‌లో చివరిది కావచ్చని ఈ మ్యాచ్‌ తర్వాత సెరెనా హింట్‌ ఇచ్చింది. తనకు రిటైర్మెంట్‌ అన్న పదం ఎప్పుడూ నచ్చదనీ,. ఓ మార్పుగా మాత్రమే చూస్తానని చెప్పింది. తన జీవితంలోని మిగతా ముఖ్యమైన అంశాలపై దృష్టిసారిస్తున్నట్లు కూడా సెరెనా తెలిపింది. కొన్నేళ్ల కిందట తాను ప్రారంభించిన సెరెనా వెంచర్స్‌పై దృష్టి సారిస్తున్నట్లు వెల్లడించింది.

కెరీర్‌లో అత్యధిక సింగిల్స్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ గెలిచిన మార్గరెట్‌ కోర్టు సరసన నిలవడానికి సెరెనా ఒక టైటిల్‌ దూరంలో ఉంది. అయితే చివరిసారి 2017లో గ్రాండ్‌స్లామ్‌ గెలిచిన ఆమె.. ఇప్పటి వరకూ మళ్లీ విజయం సాధించలేదు. 23 టైటిల్స్‌తో ఉన్న సెరెనా.. మరో టైటిల్‌ కోసం ఐదేళ్లుగా వేచి చూస్తోంది. 2017లో ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత నాలుగుసార్లు గ్రాండ్‌స్లామ్స్‌ ఫైనల్స్‌ వరకూ వెళ్లినా.. టైటిల్‌ సాధించలేకపోయింది. మార్గరేట్ ను దాటలేకపోయినందుకు తనను గ్రేటెస్ట్‌ ఆఫ్‌ టైమ్‌గా పిలవడం లేదని సెరెనా వ్యాఖ్యానించింది. పలు టోర్నీల్లో సెరెనా యువ క్రీడాకారిణిల చేతుల్లో పరాజయం పాలవుతోంది. వయసు మీద పడడంతో పాటు ఫిట్ నెస్ సమస్యలు కూడా సెరెనా ఫామ్ కు అడ్డంకిగా మారాయి. తాజా వ్యాఖ్యల నేపథ్యంలో సెరెనా కెరీర్ ఈ ఏడాది చివరికల్లా ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి.