India Tour of SA : పుజారా, రహానే దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందే

భారత క్రికెట్ లో చటేశ్వర పుజారా, అజంక్య రహానేల సత్తా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా టెస్ట్ ఫార్మేట్ లో వీరిద్దరూ ఎలాంటి ఆటగాళ్ళో ప్రత్యర్థి బౌలర్లకు బాగా తెలుసు.

  • Written By:
  • Publish Date - January 19, 2022 / 01:32 PM IST

భారత క్రికెట్ లో చటేశ్వర పుజారా, అజంక్య రహానేల సత్తా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా టెస్ట్ ఫార్మేట్ లో వీరిద్దరూ ఎలాంటి ఆటగాళ్ళో ప్రత్యర్థి బౌలర్లకు బాగా తెలుసు. ఒకసారి క్రీజులో నిలదొక్కుకున్నారంటే వారిని ఔట్ చేసేందుకు తీవ్రంగా శ్రమించాల్సిందే. ఈ క్రమంలోనే ఎన్నోసార్లు జట్టుకు విజయాలను అందించారు… ఓటములను తప్పించారు. అయితే గత కొంత కాలంగా మాత్రం వీరిద్దరూ ఫామ్ కోల్పోయారు. స్థాయికి తగినట్టు ఏ మాత్రం రాణించలేకపోతున్నారు. ప్రస్తుతం యువ ఆటగాళ్ళ నుండి గట్టిపోటీ నెలకొన్న నేపథ్యంలో పుజారా, రహానేలపై వేటు వేయాల్సిందేనన్న అభిప్రాయం వినిపిస్తోంది. అయితే టీమ్ మేనేజ్ మెంట్ మాత్రం వారికి మద్ధతుగా నిలిచింది. ఎన్నో అంచనాలు పెట్టుకున్న సౌతాఫ్రికా సిరీస్ లోనూ వీరిద్దరూ ఆకట్టుకోలేదు. పుజారా పర్వాలేదనిపించినా పూర్తిస్థాయిలో మాత్రం కాదు. అలాగే రహానే కూడా ఏ మాత్రం రాణించలేదు. దీనికి తోడు ఇంత కాలం మద్ధతుగా నిలిచిన కోహ్లీ సైతం టెస్ట్ కెప్టెన్సీ నుండి తప్పుకోవడంతో వీరిద్దరి కెరీర్ ముగిసినట్టేనన్న వార్తలు వస్తున్నాయి.

తాజాగా బీసీసీఐ వర్గాలు మాత్రం వీరిద్దరి విషయంలో ఓ క్లారిటీకి వచ్చినట్టు సమాచారం. పుజారా, రహానేలకు ఇప్పటికే చాలా అవకాశాలిచ్చామని, ఇంకా జట్టులో కొనసాగాలంటే ఇద్దరూ దేశవాళీ క్రికెట్ లో ఫామ్ అందుకోవాల్సిందేనని చెబుతున్నాయి. శ్రీలంకతో టెస్ట్ సిరీస్ కు వీరిద్దరూ ఎంపికవుతారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ప్రస్తుతం దేశవాళీ క్రికెట్ వాయిదా పడడంతో మళ్ళీ జట్టులోకి వీరిద్దరి ఎంపిక మరింత సందిగ్ధంలో పడింది. గత 12 నెలల కాలంలో 14 మ్యాచ్ లు ఆడిన పుజారా సగటు 24.08గా మాత్రమే ఉంది. 2019 జనవరి నుండి ఒక్క శతకం కూడా చేయలేకపోయాడు. అటు రహానే కూడా గత 12 నెలల కాలంలో 13 మ్యాచ్ లు ఆడితే సగటు 20 మాత్రమే.ఈ క్రమంలో కేవలం మూడు హాఫ్ సెంచరీలు చేసిన రహానే 10 సార్లు సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యాడు.

ఇటీవలే ముగిసిన సౌతాఫ్రికా టెస్ట్ సిరీస్ లో భారత జట్టుకు వచ్చిన ఎక్స్ ట్రాల కంటే వీరిద్దరూ చేసిన పరుగులే తక్కువగా ఉండడం ఆశ్చర్యపరిచింది. రహానే 136 , పుజారా 124 పరుగులు చేయగా… భారత జట్టు అదనపు పరుగుల రూపంలో వచ్చినవి 136. వీరిద్దరి పేలవ ఫామ్ తో జట్టు నుండి తప్పించడమే మంచిదన్న అభిప్రాయం వినిపిస్తోంది. అయితే బీసీసీఐ సెలక్టర్లు మాత్రం దేశవాళీ క్రికెట్ ఆడి ఫామ్ నిరూపించుకుంటే మళ్ళీ జట్టులోకి తీసుకునేందుకు అవకాశముంటుందని చెబుతున్నారు. దీంతో పుజారా, రహానేలకు రంజీ సీజన్ కీలకం కానుంది. ఒకవేళ దేశవాళీ క్రికెట్ లో కూడా విఫలమైతే వీరిద్దరి అంతర్జాతీయ కెరీర్ ముగిసినట్టే.