Womens Premier League 2024: మహిళల క్రికెట్ కు గత కొంత కాలంగా ఆదరణ పెరిగింది. దాదాపు ప్రతీ జట్టులోనూ క్వాలిటీ ప్లేయర్స్ ఉండడమే దీనికి కారణం. అదే సమయంలో టీ ట్వంటీ లీగ్‌ల్లో కూడా అమ్మాయిల ఆట ఆకర్షణీయంగా మారింది. భారత అమ్మాయిలకు ఎన్నో ఏళ్ల నుంచి కలగా ఉన్న మహిళల ఐపీఎల్‌ను గత ఏడాదే బీసీసీఐ ప్రారంభించింది. తొలి సీజన్ కు అభిమానుల నుంచి మంచి ఆదరణే లభించింది. ఈ ఏడాది కొంచెం ముందుగానే రెండో సీజన్ మొదలవుతోంది. గత ఏడాది ఫార్మాట్లోనే అవే జట్లతో లీగ్ జరగబోతోంది. దాదాపుగా అన్ని జట్ల స్టార్ క్రికెటర్లూ ఆడబోతుండటంతో లీగ్ రసవత్తరంగా, హోరాహోరీగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది.
తొలి సీజన్లో విజేతగా నిలిచిన ముంబయి ఇండియన్స్ మరోసారి టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, యూపీ వారియర్స్, గుజరాత్ టైటాన్స్ ఈసారి ప్రదర్శన మార్చాలని పట్టుదలతో ఉన్నాయి. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్, రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో తొలి మ్యాచ్ నిర్వహించనున్నారు. ఈ సీజన్‌లో మొదటి దశ మ్యాచ్‌లు బెంగళూరులో రెండో దశ మ్యాచ్‌లు ఢిల్లీలో జరగనున్నాయి. తొలి సీజన్‌లో ముంబైకే పరిమితమైన డబ్ల్యూపీఎల్.. రెండో సీజన్‌లో రెండు నగరాల్లో జరగనుంది. మొత్తం ఐదు జట్లు ఒకదానితో ఒకటి రెండుసార్లు తలపడతాయి .
పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న జట్టు నేరుగా ఫైనల్‌కు వెళ్తుంది.రెండు, మూడు స్థానాల్లో నిలిచిన జట్లు ఎలిమినేటర్‌లో తలపడతాయి. ఎలిమినేటర్ విజేత టేబుల్ టాపర్ తో ఫైనల్లో తలపదుతుంది.భారత ప్రామాణిక కాలమానం ప్రకారం.. అన్ని మ్యాచ్‌లు రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతాయి.
ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు, యూపీ వారియర్జ్ జట్లు అంతర్జాతీయ స్టార్‌లతో తమ సత్తాను చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి. ప్రతి జట్టులో ఆల్ రౌండర్లు ఉండడంతో రసవత్తర మ్యాచ్ లు అభిమానులను అలరించడం ఖాయమని అంచనా వేస్తున్నారు.
Also Read: Trisha : పెద్ద మనసు చేసుకొని నన్ను క్షేమించు – అన్నాడీఎంకే నేత