Site icon HashtagU Telugu

IPL: రిచ్చెస్ట్ క్రికెట్‌ లీగ్‌కు సౌదీ సన్నాహాలు

Whatsapp Image 2023 04 14 At 21.34.13

Whatsapp Image 2023 04 14 At 21.34.13

IPL: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రపంచ క్రికెట్ స్వరూపాన్నే మార్చేసింది. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో లీగ్స్‌ పుట్టుకొచ్చాయంటే దానికి ఐపీఎల్లే కారణం. ఆ స్థాయిలో కాకున్నా దాదాపు ప్రతీ క్రికెట్ దేశంలో డొమెస్టిక్ క్రికెట్ లీగ్స్ బాగానే సక్సెస్ అయ్యాయి. అటు ఆటగాళ్ళకు , ఇటు స్పాన్సర్లకు, క్రికెట్ బోర్డులకూ కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ఈ కారణంగానే కొత్తగా క్రికెట్‌లోకి వచ్చిన దేశాలు కూడా ఐపీఎల్ తరహా లీగ్స్‌పై ఫోకస్ పెట్టాయి. తాజాగా సౌదీ అరేబియా ప్రభుత్వం కొత్తగా ఐపీఎల్ తరహా లీగ్ టోర్నమెంట్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రపంచంలోనే అత్యంత ధనిక లీగ్ టోర్నమెంట్‌గా మార్చాలని భావిస్తోంది. దీనికోసం ఐసీసీతో సంప్రదింపులు కూడా మొదలు పెట్టింది. ప్రభుత్వం తరఫున క్రికెట్‌లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలని సౌదీ అరేబియా ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఐసీసీ ఛైర్మన్ గ్రెగ్ బార్క్‌క్లే ఇదివరకే ఈ విషయాన్ని నిర్ధారించారు. ప్రపంచంలో కోట్లాది మంది వీక్షించే ఫిఫా సాకర్ టోర్నమెంట్‌, ఫార్ములా వన్ తరహాలో క్రికెట్‌లో రిచ్చెస్ట్ టీ20 లీగ్ టోర్నమెంట్‌ను నిర్వహించాలని సౌదీ అరేబియా ప్రభుత్వం ప్రణాళికలను రూపొందించుకుంది. ఈ టీ20 లీగ్ టోర్నమెంట్‌లో ఐపీఎల్ ఫ్రాంచైజీలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా అటు భారత్‌తో క్రీడా సంబంధాలు కూడా మరింత బలోపేతమౌతాయని సౌదీ భావిస్తోంది. సౌదీ అరేబియాను గ్లోబల్ క్రికెట్ డెస్టినేషన్‌గా తీర్చిదిద్దాలనుకుంటోంది.

గత కొంత కాలంగా సౌదీ క్రికెట్ బోర్డు, అక్కడి ప్రభుత్వం క్రికెట్ మౌలిక సదుపాయాలను విశేషంగా అభివృద్ది చేస్తున్నాయి. ఇప్పుడు రిచ్చెస్ట్ క్రికెట్ లీగ్‌ ప్లాన్ కూడా దానిలో భాగమే. అయితే బీసీసీఐ సపోర్ట్ ఉంటే తప్ప పూర్తిస్థాయిలో సక్సెస్ కాదని అర్థం చేసుకున్న సౌదీ పెద్దలు ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. ఐపీఎల్‌లో ఉన్న ఫ్రాంచైజీలు, కంపెనీలను భాగస్వాములుగా చేయాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించి బీసీసీఐకి ప్రతిపాదన కూడా పంపించినట్టు సమాచారం. అలాగే వీలును బట్టి భారత క్రికెటర్లను కూడా ఈ లీగ్‌ను ఆడించేందుకు కూడా ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. అయితే బీసీసీఐ ఆటగాళ్ళకు అనుమతి ఇవ్వడం అనుమానమే. మిగిలిన అంశాల్లో మాత్రం సౌదీ క్రికెట్ బోర్డుకు సపోర్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.