Sara Tendulkar: ఆస్ట్రేలియా ప్రభుత్వం తమ దేశంలో పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి భారీ ప్రచారాన్ని ప్రారంభించనుంది. ఈ ప్రచారం కింద ప్రపంచంలోని ఐదు ప్రధాన దేశాల నుంచి ప్రముఖులను బ్రాండ్ అంబాసిడర్లుగా ఎంపిక చేసింది. ఇందులో భారత్ నుంచి క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ (Sara Tendulkar) నియమితులయ్యారు. ‘కమ్ అండ్ సే గుడ్డే’ (Come and say G’day) అనే పేరుతో ఈ ప్రచారం త్వరలో ప్రారంభం కానుంది.
రూ. 1137 కోట్లతో భారీ ప్రచారం
ఈ ప్రచారం కోసం ఆస్ట్రేలియా ప్రభుత్వం ఏకంగా 13 కోట్ల డాలర్లు (భారతీయ కరెన్సీలో సుమారు రూ. 1137 కోట్లు) ఖర్చు చేయనుంది. ఈ ప్రచారం ద్వారా ఆస్ట్రేలియాలో టూరిజంను పెంచడంతో పాటు తద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా గణనీయంగా పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రచారం ముఖ్యంగా భారత్, అమెరికా, యూకే, చైనా, జపాన్ వంటి కీలక దేశాలపై దృష్టి సారిస్తుంది.
ప్రముఖుల ఎంపిక వెనుక వ్యూహం
ప్రతి దేశం నుంచి ఒక ప్రసిద్ధ వ్యక్తిని ఈ ప్రచారంలో భాగం చేయడం వెనుక ఒక వ్యూహం ఉంది. ఆయా దేశాల ప్రజలు తమకు ఇష్టమైన లేదా బాగా తెలిసిన వ్యక్తులు ఆస్ట్రేలియాలో గడిపిన అనుభవాలను చూసి, తాము కూడా ఆస్ట్రేలియాకు పర్యటనకు వెళ్లాలని ప్రేరణ పొందుతారని ఆస్ట్రేలియా భావిస్తోంది. ఈ ప్రచారంలో భాగంగా ఈ ప్రముఖులు ఆస్ట్రేలియా పర్యాటక ప్రదేశాల గురించి తమ వ్యక్తిగత అనుభవాలను పంచుకుంటారు.
Also Read: Heavy rain : హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. నగరమంతా జలమయం, ట్రాఫిక్‌కు బ్రేక్
సారా టెండూల్కర్ పాత్ర ఏమిటి?
భారత్ నుంచి ఎంపికైన సారా టెండూల్కర్, ఆస్ట్రేలియాలో తన అనుభవాలను భారత ప్రజలతో పంచుకుంటారు. ఆమె తన సోషల్ మీడియాలో మాజీ క్రికెటర్ మాథ్యూ హేడెన్ కుమార్తెతో కలిసి దిగిన ఫోటోలను ఇప్పటికే చాలాసార్లు షేర్ చేశారు. ఈ స్నేహం.. ఆస్ట్రేలియాపై ఆమెకున్న ఆసక్తి భారతీయ పర్యాటక రంగంపై సానుకూల ప్రభావం చూపుతుందని ఆస్ట్రేలియా టూరిజం వర్గాలు ఆశిస్తున్నాయి.
టూరిజం ఆస్ట్రేలియా మేనేజింగ్ డైరెక్టర్ ఫిలిపా హారిసన్ మాట్లాడుతూ.. “మా కొత్త ప్రచారంలో భాగంగా ఎంపికైన ప్రముఖులు ఆస్ట్రేలియాలో గడిపిన తమ విశేషమైన క్షణాలను ప్రజలతో పంచుకుంటారు. దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులు ఆస్ట్రేలియా పట్ల ఆకర్షితులవుతారని ఆశిస్తున్నాం” అని తెలిపారు.
ప్రచారంలో పాల్గొనే ఇతర ప్రముఖులు
- అమెరికా: ఆస్ట్రేలియన్ వన్యప్రాణి సంరక్షకుడు రాబర్ట్ ఇర్విన్.
- బ్రిటన్: ఫుడ్ రైటర్ టీవీ కుక్ నిగెలా లాసన్.
- చైనా: నటుడు యోష్ యూ.
- జపాన్: మీడియా వ్యక్తిత్వం, హాస్య కళాకారుడు అబరేరు-కున్.