Sanju Samson: ఇంగ్లాడ్‌తో ఆరంభం అదిరింది. అభిషేక్ దెబ్బకు ఇంగ్లీష్ బౌలర్లు విలవిలలాడిపోయారు. అంతకుముందు మన బౌలర్ల ముందు బట్లర్ సేన మోకరిల్లింది. రెండో టి20లో మన హైదరాబాదీ కుర్రాడు తిలక్ వర్మ ఊచకోతకు ఇంగ్లాండ్ బౌలర్లు బలయ్యారు. ఆరంభం నుంచి నిలకడగా ఆడుతూ చివరివరకు మైదానంలో ఉండి ఒంటరి పోరాటం చేశాడు. ఓ వైపు వికెలు నేలకూలుతున్నా ఒత్తిడికి లోను కాకుండా ఆచితూచి ఆడుతూ జట్టును విజయతీరాలకు చేర్చాడు. కాగా ఈ రోజు ఇరు జట్ల మధ్య రాజ్‌కోట్‌లో మూడో టి20 జరగనుంది.
తొలి రెండు టీ20 మ్యాచ్‌ల్లో ఓపెనర్ సంజు శాంసన్ (Sanju Samson) విఫలమయ్యాడు. ఇంగ్లాండ్ బౌలర్ల బౌన్సర్ల దాడిని సంజు ఎదుర్కోలేకపోయాడు. దీంతో సంజు ప్రాక్టీస్ సెషన్లో బౌన్సర్లపై దృష్టి పెట్టాడు. బౌన్సింగ్ ని ఎలా ఎదుర్కోవాలో ప్రత్యేక ప్రణాళికలు వేసుకున్నాడు. జట్టు సభ్యులకంటే ముందే స్టేడియంలో ప్రాక్టీస్ చేయడం ప్రారంభించాడు. మొదటి రెండు మ్యాచ్‌ల్లో సంజును ఇంగ్లాండ్ స్టార్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ అవుట్ చేశాడు. ఈ నేపథ్యంలో సంజు టీం ఇండియా కొత్త బ్యాటింగ్ కోచ్ సీతాన్షు కోటక్‌తో కలిసి తన బలహీనతపై దృష్టి పెట్టి ప్రాక్టీస్ చేశాడు. సంజు దాదాపు 45 నిమిషాలు ప్రాక్టీస్ చేశాడు. ఈ సమయంలో త్రో డౌన్ స్పెషలిస్ట్ కూడా అతనితో ఉన్నాడు. ప్రాక్టీస్ సమయంలో, సంజును ప్లాస్టిక్ బంతులతో ప్రాక్టీస్ చేయించారు. ఈ క్రమంలో పుల్ మరియు హుక్ షాట్లను ప్రాక్టీస్ చేశాడు. దీని తర్వాత సంజు మళ్ళీ ప్రధాన వికెట్‌పై బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. సంజు ఇక్కడ దాదాపు 30 నిమిషాలు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు.
Also Read: Health Tips: ప్రతిరోజూ ఉదయం ఇంట్లో దొరికే ఈ డ్రింక్ తాగితే బోలెడు ప్రయోజనాలు!
గతేడాది సంజు టి20 కెరీర్ అద్భుతంగా సాగింది. గతేడాది నాలుగు టి20 అంతర్జాతీయా సెంచరీలు సాధించాడు. బంగ్లాదేశ్ మరియు దక్షిణాఫ్రికాపై ఈ సెంచరీలు నమోదయ్యాయి. దక్షిణాఫ్రికా పర్యటనలో సంజు ఐదు మ్యాచ్‌ల్లో మూడింటిలో సెంచరీలు చేశాడు. కానీ వచ్చే నెలలో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి సంజూను ఎంపిక చేయకపోవడం గమనార్హం.