Site icon HashtagU Telugu

Sanju Samson: భారత ఎ జట్టు కెప్టెన్‌గా సంజూ శాంసన్‌

Sanju Samson

Sanju Samson

టీ ట్వంటీ ప్రపంచకప్‌కు పక్కన పెట్టిన సంజూ శాంసన్‌ విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. అతన్ని భారత
ఎ జట్టుకు కెప్టెన్‌గా ఎంపిక చేసింది. న్యూజిలాండ్‌ ఎ జట్టుతో జరిగే వన్డే సిరీస్‌లో భారత్ ఎ టీమ్‌ను సంజూ లీడ్ చేయనున్నాడు. టీ20 ప్రపంచకప్‌ కోసం ప్రకటించిన జట్టులో కనీసం స్టాండ్‌ బై ప్లేయర్‌గా కూడా సంజూకు అవకాశం దక్కలేదు. దీంతో అభిమానులు బీసీసీఐపై మండిపడ్డారు. తాజాగా భారత్ ఎ జట్టుకు అతడిని కెప్టెన్‌గా నియమించడంతో బాగానే కవర్‌ చేశారులే అంటూ మరోసారి కామెంట్స్ చేస్తున్నారు.

బీసీసీఐ ప్రకటించిన 16 మంది సభ్యులతో కూడిన భారత ఏ జట్టులో తెలుగు క్రికెటర్‌, వికెట్‌ కీపర్‌ కేఎస్‌ భరత్‌కు స్థానం దక్కింది. అలాగే హైదరాబాదీ క్రికెటర్ తిలక్‌ వర్మ కూడా ఎంపికయ్యాడు. వీరిద్దరూ ఇప్పటికే కివీస్‌ ఎ జట్టుతో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌కూ ఎంపికయ్యాడు. అటు యువ పేసర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ సైతం భారత ఎ వన్డే జట్టులో చోటు దక్కించుకున్నాడు. భారత్ ఎ, న్యూజిలాండ్ ఎ మధ్య తొలి రెండు టెస్టులు డ్రాగా ముగిసాయి, ప్రస్తుతం మూడో టెస్ట్ జరుగుతోంది. అనంతరం సెప్టెంబరు 22, 25, 27 తేదీల్లో రెండు జట్లూ మూడు వన్డేల సిరీస్‌లో తలపడనున్నాయి. ఈ వన్డే సిరీస్‌కు చెన్నై చిదంబరం స్టేడియం ఆతిథ్యమివ్వనుంది.

న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు భారత ఎ జట్టు:
సంజూ శాంసన్‌(కెప్టెన్‌), పృథ్వీ షా, అభిమన్యు ఈశ్వరన్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, రాహుల్‌ త్రిపాఠి, రజత్‌ పాటిదార్‌, కేఎస్‌
భరత్‌(వికెట్‌ కీపర్‌), కుల్దీప్‌ యాదవ్‌, షాబాజ్‌ అహ్మద్‌, రాహుల్‌ చహర్‌, తిలక్‌ వర్మ, కుల్దీప్‌ సేన్‌, శార్దూల్‌ ఠాకూర్‌,
ఉమ్రాన్‌ మాలిక్‌, నవదీప్‌ సైనీ, రాజ్‌ అంగద్‌ బవా.