Site icon HashtagU Telugu

Sanju Samson: రాజస్థాన్ రాయల్స్‌కు షాక్.. జట్టును వీడనున్న శాంస‌న్‌?

Sanju Samson

Sanju Samson

Sanju Samson: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో సుదీర్ఘకాలం రాజస్థాన్ రాయల్స్‌కు కెప్టెన్‌గా ఉన్న స్టార్ ఆటగాడు సంజూ శాంస‌న్‌ (Sanju Samson) ఆ జట్టును వీడాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. 2015 నుంచి రాజస్థాన్ రాయల్స్ లో అంతర్భాగంగా ఉన్న సంజూ.. 11 సంవత్సరాల తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం జట్టులో పెద్ద సంచలనాన్ని సృష్టించింది. సంజూ ఇకపై రాజస్థాన్ తరపున ఆడటానికి ఆసక్తి చూపడం లేదని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

సంబంధాలు సరిగా లేవా?

క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. సంజూ కుటుంబం, అతని సన్నిహిత మిత్రులు కూడా రాజస్థాన్ రాయల్స్‌ను విడిచిపెట్టాలని అతనికి సలహా ఇస్తున్నారు. ఫ్రాంచైజీ, సంజూ మధ్య సంబంధాలు సరిగా లేవని వారు పేర్కొన్నారు. అయితే ఐపీఎల్ నిబంధనల ప్రకారం.. ఒక ఆటగాడు ఫ్రాంచైజీని విడిచిపెట్టడం అంత సులభం కాదు. ఆటగాళ్ల ఒప్పందం 3 సంవత్సరాల కాలానికి ఉంటుంది. ప్రస్తుత సైకిల్ 2027 వరకు కొనసాగుతుంది. ఒక ఆటగాడు బయటికి వెళ్లాలంటే ఫ్రాంచైజీ అతనిని విడుదల చేయడం లేదా ట్రేడ్ చేయాలి. ఆటగాడు అభ్యర్థన చేయవచ్చు. కానీ తుది నిర్ణయం ఫ్రాంచైజీదే.

Also Read: Heavy Rain: హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షం.. సీఎం రేవంత్ కీల‌క ఆదేశాలు!

నిబంధనలు, ట్రేడింగ్ ప్రక్రియ

ట్రేడింగ్ ప్రక్రియలో మూడు రకాల డీల్స్ ఉంటాయి.

ఐపీఎల్ 2025 ఫైనల్ తర్వాత జూన్ 4 నుంచి 2026 వేలం వరకు ట్రేడింగ్ విండో తెరిచి ఉంటుంది. ఇదే సమయంలో ఫ్రాంచైజీలు కీలకమైన ట్రేడ్‌లను చర్చించుకుంటాయి. సంజూ రాజస్థాన్‌ను విడిచిపెట్టాలని అభ్యర్థించినప్పటికీ.. రాజస్థాన్ అతన్ని విడిచిపెట్టడానికి ఆసక్తి చూపడం లేదని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. అతను జట్టు కెప్టెన్‌గా కొనసాగుతాడని ఫ్రాంచైజీ విశ్వసిస్తోంది.

ఇతర జట్ల ఆసక్తి, సంజూ ప్రదర్శన

ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) వంటి జట్లు సంజూ శాంస‌న్‌పై ఆసక్తి చూపుతున్నట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా CSK, ఎంఎస్ ధోనీ స్థానంలో ఒక వికెట్ కీపర్-బ్యాటర్‌గా శాంస‌న్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే CSK నుంచి ఇంకా ఎలాంటి అధికారిక సంప్రదింపులు జరగలేదని ఒక అధికారి తెలిపారు.

సంజూ శాంస‌న్ ఐపీఎల్‌లో అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఐపీఎల్ 2025లో గాయం కారణంగా 9 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన అతను 35.63 సగటుతో 285 పరుగులు చేశాడు. 2024 సీజన్‌లో 16 మ్యాచ్‌లలో 48.27 సగటుతో 531 పరుగులు సాధించాడు. ఇందులో 5 అర్ధ సెంచరీలు ఉన్నాయి. తన ఐపీఎల్ కెరీర్‌లో అతను ఇప్పటివరకు 177 మ్యాచ్‌లలో 30.95 సగటుతో 4704 పరుగులు చేశాడు.