Sania Mirza: ఇండియన్ టెన్నిస్ ఐకాన్‌ సానియామీర్జా

భారత్‌లో మహిళల టెన్నిస్‌కు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చింది ఎవరైనా ఉన్నారంటే అది సానియామీర్జానే (Sania Mirza) ..16 ఏళ్ళకే జూనియర్ వింబుల్డన్ గెలిచి సంచలనం సృష్టించిన సానియా ప్రస్థానం రెండు దశాబ్దాల పాటు కొనసాగింది.

  • Written By:
  • Publish Date - January 28, 2023 / 11:42 AM IST

జూనియర్‌గానూ ఆడింది.. టీనేజర్‌గానూ ఆడింది.. అమ్మాయిగానే కాదు అమ్మగానూ గ్రాండ్‌శ్లామ్ టోర్నీల్లో ఆడింది. సింగిల్స్‌తో కెరీర్ మొదలుపెట్టి.. తనకు అందని ద్రాక్షగా మారిన గ్రాండ్‌శ్లామ్‌ను డబుల్స్‌లో అందుకుని..రెండు దశాబ్దాల పాటు అంతర్జాతీయ టెన్నిస్‌లో కొనసాగింది. మధ్యలో గాయాలు ఇబ్బంది పెట్టినా , మ్యారేజ్ లైఫ్‌తో బ్రేక్ వచ్చినా వెనక్కి తగ్గలేదు. తన సుదీర్ఘ కెరీర్‌ ఎక్కడ మొదలుపెట్టిందో అక్కడే వీడ్కోలు పలికింది.

భారత్‌లో మహిళల టెన్నిస్‌కు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చింది ఎవరైనా ఉన్నారంటే అది సానియామీర్జానే (Sania Mirza) ..16 ఏళ్ళకే జూనియర్ వింబుల్డన్ గెలిచి సంచలనం సృష్టించిన సానియా ప్రస్థానం రెండు దశాబ్దాల పాటు కొనసాగింది. డబ్ల్యూటీఎ సర్క్యూట్‌లో సింగిల్స్‌ ప్లేయర్‌గా ఎన్నో విజయాలు సాధించినా… గ్రాండ్‌శ్లామ్‌ టైటిల్‌ తీరని కలగానే మిగిలిపోయింది. అయితే తన గ్రాండ్‌శ్లామ్‌ కలను డబుల్స్‌లో ఎంట్రీ ఇవ్వడం ద్వారా నెరవేర్చుకుంది సానియా. వరుస గాయాలతో సింగిల్స్‌కు పూర్తిగా గుడ్‌బై చెప్పేసిన ఈ హైదరాబాదీ ప్లేయర్ డబుల్స్‌పై ఫోకస్ పెట్టి సక్సెస్ అయ్యింది. మహిళల డబుల్స్, మిక్సిడ్‌ డబుల్స్‌లో ఒకటి కాదు రెండు కాదు ఆరు గ్రాండ్‌శ్లామ్ టైటిళ్లు గెలిచి చరిత్ర సృష్టించింది.

Also Read: Dhoni Entertainment’s: ధోని ఎంటర్‌టైన్‌మెంట్స్ తొలి చిత్రం ‘ఎల్‌జిఎం’ షురూ!

భారత ఆటగాడు మహేశ్ భూపతితో జత కట్టిన సానియా 2009 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో మిక్స్‌డ్‌ డబుల్స్‌ టైటిల్‌తో కొత్త శకానికి నాంది పలికింది. 2012లో మహేశ్ భూపతితోనే కలిసి ఫ్రెంచ్ ఓపెన్ గెలిచింది. ఇక 2015లో స్విస్‌ దిగ్గజం మార్టినా హింగిస్‌తో జతకట్టిన సానియా మహిళల డబుల్స్‌లో అద్భుతమే చేసింది. పరస్పర అవగాహన, ఆత్మవిశ్వాసంతో ఈ జోడీ వరుసగా మూడు గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు ఖాతాలో వేసుకుంది. 2015లో వింబుల్డన్‌, యుఎస్‌ ఓపెన్‌ గెలిచిన ఈ జంట.. 2016లో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో ట్రోఫీని ముద్దాడింది. హింగిస్‌తో కలిసి డబ్ల్యూటీఎ టోర్నీల్లోనూ అదరగొట్టింది సానియా. 2015-16 సీజన్‌ వరల్డ్‌ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం కూడా సాధించిన ఈ హైదరాబాదీ టెన్నిస్ స్టార్ 91 వారాల పాటు టాప్ ప్లేస్‌లో కొనసాగింది.

పాక్‌ క్రికెటర్ షోయబ్ మాలిక్‌తో వివాహం తర్వాత కూడా ఆటను కొనసాగించిన ఆమెబిడ్డకు జన్మనిచ్చిన తర్వాత దాదాపు రెండేళ్ళపాటు ఆటకు దూరమైంది. మళ్ళీ ఫిట్‌నెస్ సాధించి రాకెట్ పట్టిన సానియా అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయింది. డబ్ల్యూటీఎ టోర్నీల్లో పర్వాలేదనిపించినా గ్రాండ్‌శ్లామ్స్‌లో మాత్రం నిరాశే ఎదురైంది. ఈ క్రమంలో గత ఏడాదే తన రిటైర్మెంట్‌పై నిర్ణయం ప్రకటించిన సానియా కెరీర్‌లో చివరి గ్రాండ్‌శ్లామ్‌ను రన్నరప్‌గా ముగించింది. తన ప్రొఫెషనల్ కెరీర్‌ను ఎక్కడ ప్రారంభించిందో అదే వేదికగా వీడ్కోలు పలకడం సానియాను ఉద్వేగానికి గురి చేసింది. భారత్‌లో టెన్నిస్‌ ఐకాన్‌గా నిలిచిన సానియా 20 ఏళ్ళ పాటు కెరీర్‌ కొనసాగించడం సామాన్యమైన విషయం కాదనేది అంగీకరించాల్సిందే.