Sania Mirza: మొదలు పెట్టిన చోటే ముగించి… సానియా భావోద్వేగం

ఏ ఆటలోనైనా ఏదో ఒక సందర్భంలో వీడ్కోలు పలకాల్సిందే...ఎన్నో ఏళ్ల పాటు ఆటతో మమేకమై పలు విజయాలు , మరెన్నో రికార్డులు సాధించినప్పుడు...

Published By: HashtagU Telugu Desk
Sania

Sania

Sania Mirza: ఏ ఆటలోనైనా ఏదో ఒక సందర్భంలో వీడ్కోలు పలకాల్సిందే…ఎన్నో ఏళ్ల పాటు ఆటతో మమేకమై పలు విజయాలు , మరెన్నో రికార్డులు సాధించినప్పుడు…సహజంగానే రిటైర్ మెంట్ సమయంలో భావోద్వేగానికి లోనవుతుంటారు. తాజాగా భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కూడా ఎమోషనల్ అయింది. నిజానికి గత నెలలోనే తన కెరీర్ లో చివరి మ్యాచ్ ఆడేసింది.అయితే సొంత గడ్డపై అభిమానుల కోసం ఎల్బీ స్టేడియంలో ఫేర్ వెల్ మ్యాచ్ ఆడింది. ఈ సందర్భంగా ఎమోషనల్ అయిన సానియా కంటతడి పెట్టుకుంది.తన 20 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో జరిగిన సంఘటనలు గుర్తు చేసుకుంటూ కంటతడి పెట్టింది. ఈ సందర్భంగా సానియా కొడుకు అమ్మ గ్రేట్ అంటూ తన ప్రేమను వ్యక్తం చేయడంతో స్టేడియం మొత్తం హర్షద్వానాలు మార్మోగింది. రెండు దశాబ్దాలుగా దేశం కోసం ఆడటమే తనకు దక్కిన గొప్ప గౌరవమని ఈ సందర్భంగా పేర్కొంది.

సానియా ఆడే చివరి మ్యాచ్‌ చూసేందుకు క్రీడారంగానికి చెందిన వారితో పాటు టాలీవుడ్‌, బాలీవుడ్‌, ఇతర రంగాలకు చెందిన సెలబ్రిటీలు తరలి వచ్చారు. టీమిండియా మాజీ కెప్టెన్‌ మహ్మద్‌ అజహారుద్దీన్‌, సిక్సర్ల కింగ్‌ యువరాజ్‌ సింగ్‌, సీతారామం ఫేమ్‌ దుల్కర్‌ సల్మాన్‌ ఈ ఈవెంట్‌లొ సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా నిలిచారు. కాగా తన 20 ఏళ్ల ప్రొఫెషనల్‌ టెన్నిస్‌ కెరీర్‌లో 6 గ్రాండ్ స్లామ్ టైటిల్స్, 43 WTA టైటిల్స్‌, ఏసియన్ గేమ్స్ లో 8 పతకాలు, కామన్వెల్త్ గేమ్స్ లో 2 మెడల్స్ సాధించింది. భవిష్యత్తుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పిన సానియా కుటుంబంతో మరింత సమయం గడుపుతానని వెల్లడించింది. అలాగే మొయినాబాద్ లోని తన టెన్నిస్ అకాడమీకి కూడా మరింత సమయం వెచ్చిస్తానని ఈ హైదరాబాదీ టెన్నిస్ స్టార్ తెలిపింది. సానియా మహిళల ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీమ్ కు మెంటార్ గా వ్యవహరిస్తోంది.

  Last Updated: 05 Mar 2023, 10:54 PM IST