Jayasurya:జయసూర్య…వాట్ ఏ స్పెల్

దిగ్గజ క్రికెటర్లంతా కలిసి ఆడుతున్న రోడ్ సేఫ్టీ సిరీస్‌ ఆసక్తికరంగా సాగుతోంది. రిటైరయి చాలా ఏళ్ళు దాటినా ఏ ఒక్కరిలోనూ ఆట ఏమాత్రం తగ్గలేదు.

  • Written By:
  • Publish Date - September 14, 2022 / 05:46 PM IST

దిగ్గజ క్రికెటర్లంతా కలిసి ఆడుతున్న రోడ్ సేఫ్టీ సిరీస్‌ ఆసక్తికరంగా సాగుతోంది. రిటైరయి చాలా ఏళ్ళు దాటినా ఏ ఒక్కరిలోనూ ఆట ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుత క్రికెట్ తరానికి ధీటుగా తమ ఆటతీరుతో అదరగొడుతున్నారు దిగ్గజ ఆటగాళ్ళు. తాజాగా శ్రీలంక మాజీ క్రికెటర్ సనత్ జయసూర్య అద్భుతమైన గణాంకాలతో చెలరేగిపోయాడు. 4 ఓవర్లలో కేవలం 3 పరుగులకే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. టీ ట్వంటీ క్రికెట్‌లో ఇదే అత్యుత్తమ గణాంకాలు. బ్యాటర్లు ఆధిపత్యం కనబరిచే షార్ట్ ఫార్మాట్లో ఇలాంటి బౌలింగ్‌ ఫిగర్స్‌ నమోదు చేయడం చిన్న విషయం కాదు. దీంతో 53 ఏళ్ల జయసూర్యపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇంగ్లాండ్ లెజెండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో జయసూర్య ఈ ఘనత సాధించాడు. తన స్పిన్‌ మ్యాజిక్‌తో ఇంగ్లండ్‌ లెజెండ్స్‌ను ముప్పుతిప్పలు పెట్టాడు.

చాలా సింపుల్‌ యాక్షన్‌తో, నాలుగు అడుగుల రనప్‌తో జయసూర్య వేసే లెఫ్టామ్‌ స్పిన్‌ బౌలింగ్‌ ఎప్పుడూ వింతగానే ఉంటుంది. బ్యాట్‌తోనే ఎక్కువ సార్లు మ్యాచ్‌లు గెలిపించినా.. పలు సందర్భాల్లో తన స్పిన్ మ్యాజిక్‌నూ చూపించాడు. ఇప్పుడు మరోసారి తన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఇంగ్లాండ్ లెజెండ్స్‌తో మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసిన జయసూర్య రెండు మెయిడెన్లు చేశాడు. మరో రెండు ఓవర్లలో కేవలం మూడు పరుగులే ఇచ్చాడు. నాలుగు వికెట్లు కూడా తీసుకున్నాడు. ఇంగ్లండ్‌ లెజెండ్స్‌ టీమ్‌లో మాల్‌ లోయ్‌, డారెన్‌ మ్యాడీ, టిమ్ ఆంబ్రోస్‌, డిమిత్రి మస్కరెన్హాస్‌లను ఔట్ చేశాడు. జయసూర్యతో పాటు నువాన్‌ కులశేఖర్‌, చతురంగ డిసిల్వా కూడా రాణించడంతో ఇంగ్లండ్‌ లెజెండ్స్‌ 19 ఓవర్లలో 78 రన్స్‌కే కుప్పకూలింది. తర్వాత శ్రీలంక 14.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.