Sam Konstas: భారత్-ఆస్ట్రేలియా ‘ఎ’ జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ సెప్టెంబర్ 16న లక్నోలో ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో భారత్ ‘ఎ’ జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకోగా.. ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టు బ్యాటింగ్ చేసింది. ఆస్ట్రేలియా ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ శామ్ కాన్స్టాస్ (Sam Konstas) అద్భుతమైన శతకంతో భారత బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టాడు. శామ్ కాన్స్టాస్ తన చక్కటి ఆరంభాన్ని శతకంగా మలచుకున్నాడు. గతంలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో కూడా అతను మంచి ప్రదర్శన కనబరిచాడు.
శామ్ కాన్స్టాస్ శతకం
శామ్ కాన్స్టాస్ 144 బంతుల్లో 109 పరుగులు చేసి తన ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. మ్యాచ్ ప్రారంభం నుంచే అతను మంచి లయలో కనిపించాడు. అన్ని దిశల్లోనూ షాట్లు ఆడుతూ ఆస్ట్రేలియాకు బలమైన పునాది వేశాడు. శామ్ కాన్స్టాస్‌తో పాటు క్యాంప్‌బెల్ కెలావే కూడా 96 బంతుల్లో 88 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు.
Also Read: Nara Lokesh London : లండన్‌లో ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా నారా లోకేష్
తొలి రోజు ఆస్ట్రేలియా 337 పరుగులు
తొలి రోజు ఆట ముగిసేసరికి ఆస్ట్రేలియా 5 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. శామ్ కాన్స్టాస్, క్యాంప్‌బెల్ కెలావే కాకుండా కూపర్ కొనోలీ 84 బంతుల్లో 70 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే లియామ్ స్కాట్ 47 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ తొలి రోజు అద్భుతమైన ఆటతీరు కనబరిచి భారత బౌలింగ్‌ను నిలవనివ్వలేదు. భారత్ తరఫున ఇంగ్లాండ్ సిరీస్‌లో అరంగేట్రం చేసిన తనుష్ కొటియాన్ అత్యంత ఖరీదైన బౌలర్‌గా నిలిచాడు. అతను 19 ఓవర్లలో 92 పరుగులు ఇచ్చాడు. ప్రసిధ్ కృష్ణ, ఖలీల్ అహ్మద్ కూడా భారీగా పరుగులు సమర్పించుకున్నారు. భారత్ తరఫున హర్ష్ దూబే అత్యధికంగా 3 వికెట్లు పడగొట్టాడు.
రెండో రోజు ఆటలో పుంజుకోవాలంటే భారత బౌలర్లు ఆస్ట్రేలియాను త్వరగా ఆలౌట్ చేయాలి. అదే సమయంలో భారత బ్యాట్స్‌మెన్ కూడా అద్భుతంగా రాణించి మ్యాచ్‌ను తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలి. భారత ‘ఎ’ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్.. అలాగే ఇంగ్లాండ్ సిరీస్‌లో ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కని అభిమన్యు ఈశ్వరన్ ఈ మ్యాచ్‌లో మెరుగైన ప్రదర్శన చేయాలని చూస్తారు.