Site icon HashtagU Telugu

Saina Nehwal: భర్తతో విడాకులు.. భారీ ట్విస్ట్ ఇచ్చిన సైనా నెహ్వాల్!

Saina Nehwal

Saina Nehwal

Saina Nehwal: భారత బ్యాడ్మింటన్ క్రీడా ప్రపంచంలో సంచలనం సృష్టించిన వార్త ఇది. కేవలం కొన్ని వారాల క్రితం విడిపోతున్నట్లు ప్రకటించిన స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ (Saina Nehwal), ఆమె భర్త పారుపల్లి కశ్యప్ ఇప్పుడు తమ నిర్ణయాన్ని మార్చుకుని తిరిగి కలిసి ఉండటానికి సిద్ధమయ్యారు.

జులై నెలలో సైనా నెహ్వాల్ తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ద్వారా తమ వివాహ బంధానికి ముగింపు పలుకుతున్నట్లు ప్రకటించారు. ‘‘జీవితం కొన్నిసార్లు మనల్ని వేర్వేరు దిశలలో నడిపిస్తుంది. చాలా ఆలోచించిన తర్వాత నేను, కశ్యప్ విడిపోవాలని నిర్ణయించుకున్నాం. మా గోప్యతను గౌరవించండి’’ అని ఆమె రాసిన పోస్ట్ అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. దశాబ్దానికిపైగా సాగిన వారి ప్రేమ బంధం.. 2018లో వివాహంగా మారిన ఈ ప్రయాణం ఇలా అర్ధాంతరంగా ముగిసిపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

అయితే తాజాగా సైనా నెహ్వాల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న ఒక ఫోటో ఇప్పుడు అన్ని అనుమానాలకు తెర దించింది. సముద్రం, పర్వతాల నేపథ్యంలో కశ్యప్‌తో కలిసి ఉన్న అందమైన ఫోటోను పోస్ట్ చేస్తూ ‘‘కొన్నిసార్లు దూరం సన్నిహితత్వాన్ని నేర్పుతుంది. ఇక్కడ మేము మళ్లీ ప్రయత్నిస్తున్నాము’’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ ఒక్క వాక్యం వారి మధ్య ఉన్న విభేదాలు తొలగిపోయి, మళ్లీ కలవడానికి సిద్ధమయ్యారని స్పష్టం చేసింది.

Also Read: Software Employees: హైద‌రాబాద్‌లోని ఐటీ ఉద్యోగులకు షాకింగ్ న్యూస్!

వారి బంధం ఒక ఆదర్శం

సైనా, కశ్యప్‌ల బంధం కేవలం భార్యాభర్తలకే పరిమితం కాలేదు. కోర్టులో, కోర్టు వెలుపల ఒకరికొకరు మద్దతు ఇచ్చుకుంటూ భారత బ్యాడ్మింటన్‌కు తమ వంతు సేవలు అందించారు. సైనా ప్రపంచ నంబర్ 1 ర్యాంకును అందుకున్న తొలి భారతీయ మహిళగా, ఒలింపిక్ కాంస్య పతక విజేతగా నిలిచారు. అదేవిధంగా పారుపల్లి కశ్యప్ కూడా కామన్వెల్త్ గేమ్స్, ఒలింపిక్స్ వంటి అంతర్జాతీయ టోర్నమెంట్లలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి గొప్ప క్రీడాకారుడిగా పేరు తెచ్చుకున్నారు. వారిద్దరి అపారమైన అనుభవం, ఒకరి పట్ల ఒకరికి ఉన్న గౌరవం వారి బంధాన్ని మరింత దృఢంగా మార్చాయి.

వారిద్దరూ తిరిగి కలవాలని తీసుకున్న ఈ నిర్ణయాన్ని అభిమానులు, క్రీడా ప్రముఖులు స్వాగతించారు. సైనా కొత్త పోస్ట్ కింద వేల సంఖ్యలో అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తూ ‘‘మీరిద్దరూ మళ్లీ కలిసి ఉండటం చాలా సంతోషంగా ఉంది’’ అని కామెంట్లు పెడుతున్నారు. ఈ పరిణామంతో సైనా, కశ్యప్‌ల బంధం మరింత బలంగా, స్థిరంగా సాగుతుందని అందరూ ఆశిస్తున్నారు.