Sai Sudharsan: ఎందరో ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్‌లు భారత క్రికెట్ జట్టు తరపున ఆడారు. తమ ఆటతీరుతో ఎన్నో చిరస్మరణీయ మ్యాచ్‌లను గెలిపించి కోట్లాది అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు. దేశం తరఫున ఆడిన అత్యుత్తమ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ల విషయానికి వస్తే సౌరవ్ గంగూలీ, యువరాజ్ సింగ్, గౌతమ్ గంభీర్, సురేశ్ రైనా పేర్లు గుర్తుకు వస్తాయి. ప్రస్తుతం జట్టులో రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్ వంటి బ్యాట్స్‌మెన్‌లు లెఫ్ట్ హ్యాండ్ తో బ్యాటింగ్ చేస్తూ అద్భుతాలు సృష్టిస్తున్నారు. త్వరలో మరో లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ మెన్ టీమిండియాకు పరిచయం కాబోతున్నాడు.
దేశవాళీ క్రికెట్‌లో 22 ఏళ్ల సాయి సుదర్శన్ (sai sudarshan) సత్తా చాటుతున్నాడు. సాయి ప్రదర్శన సీనియర్లను ఆకట్టుకుంది. గంభీర్ (gambhir) సైతం ఈ కుర్రాడి ప్రదర్శనపై ఆసక్తిగా ఉన్నాడట.తమిళనాడు తరపున దేశవాళీ క్రికెట్ ఆడుతున్న లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ సాయి సుదర్శన్ టీమిండియాలో చోటు కోసం ఎదురు చూస్తున్నాడు. సీనియర్ ఆటగాళ్ల కారణంగా ప్రస్తుతం జాతీయ జట్టులో అతనికి చోటు దక్కడం లేదు. అతని ప్రదర్శన కారణంగా సాయికి త్వరలోనే భారత జట్టులో అవకాశం దక్కడం ఖాయంగా కనిపిస్తుంది. సాయి సుదర్శన్ మూడు ఫార్మాట్లలో రాణిస్తున్నాడు. ఐపీఎల్, టీమ్ ఇండియా, దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా మంచి ఆటతీరుతో అభిమానులను సొంతం చేసుకున్నాడు. సాయి సుదర్శన్ ఒక్కో ఫార్మాట్‌లో ఒక్కో స్థాయిలో సెంచరీలు సాధించాడంటే అతని రేంజ్ ఏంటో అంచనా వేయవచ్చు.
సుదర్శన్ భారత్ ఎ తరఫున ఆడుతున్న సమయంలో పాకిస్థాన్ ఎతో జరిగిన వన్డేలో సెంచరీ సాధించాడు. ఐపీఎల్‌లో సెంచరీ సాధించాడు. తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో సెంచరీ సాధించాడు. కౌంటీ క్రికెట్‌లో సెంచరీ చేసిన అతను దులీప్ ట్రోఫీలో కూడా సెంచరీ సాధించాడు. దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌లో భారత్ తరఫున అరంగేట్రం చేసిన సుదర్శన్ 3 వన్డేల్లో 2 అర్ధ సెంచరీలతో 127 పరుగులు చేశాడు. ఒక్క వన్డేలో ఆడే అవకాశం రాలేదు. ఇది కాకుండా అతను 23 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో 5 సెంచరీలతో 1494 పరుగులు చేశాడు. 28 లిస్ట్ A మ్యాచ్‌లలో 6 సెంచరీలతో 1396 పరుగులు, అలాగే 44 టి20 మ్యాచ్‌లలో 1 సెంచరీతో 1503 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడుతున్న సుదర్శన్ 25 మ్యాచ్‌ల్లో 1 సెంచరీ, 6 హాఫ్ సెంచరీలతో 1034 పరుగులు చేశాడు.