Site icon HashtagU Telugu

Sachin Tendulkar: సచిన్ లక్ష్యానికి నాంది పలికిన విజయం

Sachin Tendulkar

Sachin Tendulkar

కొన్ని విజయాలు కొందరికి ఆనందాన్నిస్తే… మరికొందరికి స్ఫూర్తినిస్తాయి.. ఆ స్ఫూర్తి గొప్ప లక్ష్యానికి నాంది పలుకుతుంది. భారత క్రికెట్‌లో 1983 ప్రపంచకప్ విజయం రికార్డుల రారాజు సచిన్ టెండూల్కర్‌ కెరీర్‌ ఆరంభానికి నాంది పలికింది. చాలాసార్లు సచినే ఈ విషయాన్ని స్వయంగా చెప్పాడు. 83లో భారత్ వరల్డ్‌కప్ గెలిచేసమయానికి సచిన్‌ టెండూల్కర్‌ వయసు పదేళ్లు. క్రికెట్‌ను ఏదో టైంపాస్‌లా ఆడుతున్న అతన్ని ఆ వరల్డ్‌కప్‌ విజయం ఈ గేమ్‌వైపు సీరియస్‌గా అడుగులు వేసేలా చేసింది. ఆ తర్వాతి కాలంలో అదే సచిన్‌ క్రికెట్‌ గాడ్‌గా మారాడు. తాను కూడా ఏదో ఒక రోజు వరల్డ్‌కప్‌ను అందుకోవాలన్న కల కనేలా 1983 వరల్డ్‌కప్‌ విజయం చేసిందని సచిన్‌ మరోసారి గుర్తు చేసుకున్నాడు.

ఈ చారిత్రక విజయం సాధించి 39 ఏళ్లయిన సందర్భంగా శనివారం సచిన్‌ ట్వీట్‌ చేశాడు. కొన్ని ఘటనలు జీవితంలో మనలో స్ఫూర్తి నింపుతాయనీ, 1983లో ఇదే రోజు తొలిసారి మనం వరల్డ్‌కప్‌ గెలిచామనీ, తాను చేయాల్సింది ఇదే అని అంటూ మాస్టర్‌ ట్వీట్‌ చేశాడు. 1983 ప్రుడెన్షియల్ కప్‌లో కపిల్‌ సారథ్యంలోని టీమిండియా అసాధ్యాన్ని సుసాధ్యం చేసి క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. ఆ వరల్డ్‌కప్‌ ఫైనల్లో ఏకంగా వెస్టిండీస్‌లాంటి అజేయమైన టీమ్‌ను మట్టి కరిపించడం కపిల్‌ డెవిల్స్‌ సత్తాకు నిదర్శనంగా నిలిచింది.

ఆ తర్వాత మళ్ళీ 2011లో టీమిండియా వరల్డ్‌కప్ గెలిచింది. ధోనీ సారథ్యంలో మన జట్టు ప్రపంచకప్ గెలిచిన జట్టులో సచిన్‌ సభ్యుడిగా ఉన్నాడు. రికార్డు స్థాయిలో ఆరు వరల్డ్‌కప్‌లు ఆడిన సచిన్‌.. మొత్తానికి తాను ఆడిన చివరి వరల్డ్‌కప్‌లో తన కలను సాకారం చేసుకున్నాడు. 1992, 1996, 1999, 2003, 2007, 2011 వరల్డ్‌కప్‌లలో సచిన్‌ ఆడాడు. 2003లో ఫైనల్‌ వరకూ చేరినా సచిన్‌ కల నెరవేరలేదు. 2011లో మాత్రం ధోనీ కెప్టెన్సీలోని టీమిండియా 28 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది.