SA20 Auction : సౌతాఫ్రికా టీ ట్వంటీ లీగ్ లో స్టబ్స్ పై కాసుల వర్షం

ఇండియన్ ప్రీమియర్ లీగ్ తరహాలోనే పలు దేశాలు కూడా లీగ్స్ ప్రారంభించగా.. వాటిలో కొన్ని మాత్రమే విజయవంతమయ్యాయి.

  • Written By:
  • Publish Date - September 20, 2022 / 03:46 PM IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్ తరహాలోనే పలు దేశాలు కూడా లీగ్స్ ప్రారంభించగా.. వాటిలో కొన్ని మాత్రమే విజయవంతమయ్యాయి. ఆస్ట్రేలియా బోర్డు బిగ్ బాష్, ఇంగ్లాండ్ బోర్డు టీ ట్వంటీ బ్లాస్ట్ , విండీస్ బోర్డు కరేబియన్ ప్రీమియర్ లీగ్ ఇలా లీగ్స్ కు శ్రీకారం చుట్టాయి. తాజాగా సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు కూడా ఐపీఎల్ తరహాలోనే లీగ్ ను ఆరంభించబోతోంది. వచ్చే ఏడాది ఈ లీగ్ జరగనుండగా.. దీనికి సంబంధించి ఆటగాళ్ళ వేలం జరిగింది. ఈ లీగ్ లో పలు ఐపీఎల్ ఫ్రాంచైజీలే జట్లను కొనుగోలు చేశాయి. ఈ వేలంలో సౌతాఫ్రికా హిట్టర్ ట్రిస్టన్ స్టబ్స్ రికార్డు ధర పలికాడు. అతడిని 9.2 మిలియన్ ర్యాండ్లకు భారత కరెన్సీలో రూ.4 కోట్ల 14 లక్షలకు సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టు సొంతం చేసుకుంది. ఎంఐ కేప్ టౌన్ ఫ్రాంచైజీతో తీవ్రంగా పోటీ పడిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ జట్టు చివరకు భారీ మొత్తానికి ట్రిస్టన్ స్టబ్స్‌ను కొనుగోలు చేసింది.

ఈ వేలంలో పలువురు యువ ఆటగాళ్ళపై కాసుల వర్షం కురిసింది. ఇప్పటి వరకూ అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడని మరో ఆటగాడు డోనావన్ ఫియర్రా కూడా భారీ మొత్తం పలికాడు. భారత కరెన్సీలో రూ.7 లక్షల 88 వేల బేసిక్ ప్రైజ్‌ ఉన్న ఇతడిని.. సూపర్ కింగ్స్ జట్టు 2 కోట్ల 47 లక్షలకు సొంతం చేసుకుంది. డోనావన్ కోసం పార్ల్ రాయల్స్, ప్రిటోరియా క్యాపిటల్స్ మధ్య గట్టిపోటీ నడిచింది. అలాగే
డ్వాన్ జాన్సెన్, మార్కో జాన్సెన్ సోదరులకు వేలంలో మంచి డిమాండ్ దక్కింది. మార్కోను సన్‌రైజర్స్ 2 కోట్ల 74 లక్షలు పలకగా.. డ్వాన్‌ను ఎంఐ కేప్ జట్టు కోటి 48 లక్షలకు సొంతం చేసుకుంది. అలాగే ఆల్ రౌండర్ వేన్ పార్నెల్‌ను సూపర్ కింగ్స్ జట్టు రూ.2 కోట్ల 50 లక్షలకు కొనుగోలు చేసింది. ఇదిలా ఉంటే సౌతాఫ్రికా టీ20 కెప్టెన్ టెంబా బవుమా, టెస్ట్ కెప్టెన్ డీన్ ఎల్గార్‌పై ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి చూపలేదు. దీంతో వేలంలోవీరు అన్ సోల్డ్ గా మిగిలారు.