Ruturaj Gaikwad: దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో సెంచరీ సాధించినప్పటికీ న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో రుతురాజ్ గైక్వాడ్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయారు. అయినప్పటికీ గైక్వాడ్ బ్యాట్ ఆగడం లేదు. ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో మహారాష్ట్ర జట్టు తరపున ఆడుతూ ఆయన మెరుపు ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకుంటున్నారు. తాజాగా గోవాతో జరిగిన మ్యాచ్‌లో అజేయ సెంచరీతో చెలరేగిన గైక్వాడ్.. ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడి రికార్డును బద్దలు కొట్టి సరికొత్త చరిత్ర సృష్టించారు.
గైక్వాడ్ సృష్టించిన చరిత్ర ఇదే
గోవాతో జరిగిన మ్యాచ్‌లో మహారాష్ట్ర జట్టు కేవలం 25 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ సమయంలో కెప్టెన్ గైక్వాడ్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్ది 131 బంతుల్లో 134 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. ఈ ఇన్నింగ్స్‌లో ఆయన 8 ఫోర్లు, 6 సిక్సర్లు బాదారు. దీనివల్ల మహారాష్ట్ర జట్టు 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 249 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది.
Also Read: అశ్లీల కంటెంట్ వివాదం, గ్రోక్ నివేదికపై కేంద్రం అసంతృప్తి!
ఈ ఇన్నింగ్స్‌తో లిస్ట్-ఏ క్రికెట్‌లో గైక్వాడ్ సగటు 58.83కి చేరుకుంది. దీని ద్వారా ఆయన ఆస్ట్రేలియా దిగ్గజం మైఖేల్ బెవన్ రికార్డును అధిగమించారు. గైక్వాడ్ ఇప్పటివరకు 95 లిస్ట్-ఏ ఇన్నింగ్స్‌లలో 20 సెంచరీలు సాధించారు.
సెంచరీతో గైక్వాడ్ నెలకొల్పిన 3 భారీ రికార్డులు
సగటులో అగ్రస్థానం: అత్యధిక సగటు కలిగిన ఆటగాళ్ల జాబితాలో నంబర్ 1 స్థానానికి చేరుకోవడంతో పాటు లిస్ట్-ఏ క్రికెట్‌లో 5 వేల పరుగుల మైలురాయిని కూడా చేరుకున్నారు.
విజయ్ హజారే ట్రోఫీలో రికార్డు: విజయ్ హజారే ట్రోఫీలో అత్యధిక సెంచరీలు బాదిన బ్యాటర్‌గా అంకిత్ బావ్నేతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. అంకిత్ బావ్నే 101 ఇన్నింగ్స్‌ల్లో 15 సెంచరీలు చేయగా, గైక్వాడ్ కేవలం 59 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించడం విశేషం.
కోహ్లీ రికార్డు అధిగమనం: సగటు విషయంలో గైక్వాడ్ గత మ్యాచ్‌లోనే ‘కింగ్’ విరాట్ కోహ్లీని కూడా వెనక్కి నెట్టారు.
