BCCI: ఆసియా కప్ 2025పై అందరి దృష్టి ఉన్న ఈ సమయంలో క్రికెట్ ప్రపంచంలో రూ. కోట్లకు సంబంధించిన కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఉత్తరాఖండ్ క్రికెట్ అసోసియేషన్‌లో జరిగిన రూ. 12 కోట్ల అవకతవకలపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI)కి నైనిటాల్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణ వచ్చే శుక్రవారం జరగనుంది.
ఏమిటీ కుంభకోణం?
ఈ కుంభకోణానికి సంబంధించి డెహ్రాడూన్‌కు చెందిన సంజయ్ రావత్ అనే వ్యక్తి హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. అందులో ఉత్తరాఖండ్ క్రికెట్ అసోసియేషన్ నియమాలను పాటించడం లేదని, ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. ఆటగాళ్ల అభివృద్ధి, క్రికెట్ నిర్వహణ కోసం కేటాయించిన రూ. 12 కోట్ల నిధులను దుర్వినియోగం చేశారని, ఆటగాళ్లకు ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదని ఆయన పేర్కొన్నారు.
Also Read: India XI vs UAE: ఆసియా కప్ 2025.. నేడు యూఏఈతో టీమిండియా మ్యాచ్, ప్లేయింగ్ 11 ఇదేనా?
ఆడిట్‌లో అక్రమాలు
సదరు పిటిషనర్ తమకు కేటాయించిన నిధులను క్రికెట్ అసోసియేషన్ తమ చార్టెడ్ అకౌంటెంట్‌తో కాకుండా, బయటి వ్యక్తితో ఆడిట్ చేయించిందని, తద్వారా అవకతవకలను దాచిపెట్టేందుకు ప్రయత్నించిందని ఆరోపించారు. ఈ వ్యవహారంపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని రావత్ కోర్టును కోరారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ మనోజ్ కుమార్ తివారి ఏకసభ్య ధర్మాసనం బీసీసీఐని వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది.
అతి భారీ ఖర్చులు ఈ కుంభకోణంలో బయటపడిన ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఆడిట్ రిపోర్టు ప్రకారం ఆటగాళ్లకు కేవలం అరటిపండ్ల కోసమే రూ. 35 లక్షలు ఖర్చు చేసినట్లుగా చూపించారు. అలాగే ఆహారం, క్యాంపుల పేరుతో అనేక కోట్ల రూపాయల ఖర్చు చూపించినప్పటికీ వాస్తవంగా అంత ఖర్చు చేయలేదని పిటిషనర్ ఆరోపించారు. ఈ ఆరోపణలు నిజమని తేలితే ఉత్తరాఖండ్ క్రికెట్ అసోసియేషన్‌పై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.