RR vs MI Prediction: ఐపీఎల్ లో మరో హైఓల్టేజ్ మ్యాచ్.. ఎవరి సత్తా ఎంత?

ఐపీఎల్ 38వ మ్యాచ్‌లో భాగంగా ఈ రోజు రాజస్థాన్ రాయల్స్ ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. సంజూ శాంసన్ నేతృత్వంలోని రాజస్థాన్ జట్టు ఈ సీజన్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉంది.

RR vs MI Prediction: ఐపీఎల్ 38వ మ్యాచ్‌లో భాగంగా ఈ రోజు రాజస్థాన్ రాయల్స్ ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. సంజూ శాంసన్ నేతృత్వంలోని రాజస్థాన్ జట్టు ఈ సీజన్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉంది. బ్యాటింగ్. బౌలింగ్ దళంలో సమిష్టిగా రాణిస్తుంది. రాజస్థాన్ రాయల్స్ ఇప్పటి వరకు ఆడిన 7 మ్యాచ్‌లలో 6 గెలిచింది. ఒక మ్యాచ్‌లో ఓటమిని చవిచూసింది. మరోవైపు పాయింట్ల పట్టికలో ముంబై ఇండియన్స్ జట్టు ఆరో స్థానంలో ఉంది. దీంతో ఆర్ఆర్ తో జరిగే మ్యాచ్ ముంబై ఇండియన్స్ కు అత్యంత కీలక మ్యాచ్ కానుంది. రాజస్థాన్ హోమ్ గ్రౌండ్‌లో ఇరు జట్ల మధ్య హై-వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది.

ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ మధ్య మొత్తం 29 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో ముంబై ఇండియన్స్ పైచేయి సాధించింది. ముంబై 15 సార్లు గెలిచింది. రాజస్థాన్‌ 13 విజయాలు సాధించింది. ఒక మ్యాచ్ అసంపూర్తిగా మిగిలిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు 3 మ్యాచ్‌లు గెలవగా, ముంబై ఇండియన్స్ 8 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఇక పిచ్ విషయానికి వస్తే.. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం పిచ్ బ్యాట్స్‌మెన్‌కు అనుకూలంగా ఉంది. ఈ పిచ్ మంచి బౌన్స్ అందిస్తుంది. కాబట్టి బ్యాట్స్‌మెన్లు భారీ పరుగులకు సాదించేందుకు స్కోప్ ఉంది. మ్యాచ్ సాగుతున్నా కొద్దీ పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా మారుతుందని చెప్తున్నారు పిచ్ అనలిస్టులు. మరోవైపు ఐపీఎల్‌లో ఇప్పటివరకు సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం 55 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చింది. తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు 20 మ్యాచ్‌ల్లో విజయాన్ని చవిచూసింది. లక్ష్యాన్ని ఛేదించిన జట్టు 35 మ్యాచ్‌లు గెలిచింది. అంటే టాస్ గెలిచి జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. కాగా ఈ మైదానంలో తొలి ఇన్నింగ్స్‌లో సగటు స్కోరు 160.

We’re now on WhatsApp : Click to Join

జట్టు బలాబలాలు చూస్తే.. రాజస్థాన్ బ్యాటింగ్ ఆర్డర్ అద్భుత ఫామ్‌లో ఉంది. గత మ్యాచ్‌లో కేకేఆర్‌పై జోస్ బట్లర్ సెంచరీ చేశాడు. కెప్టెన్‌ సంజూ శాంసన్‌ కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు. బౌలర్లు కూడా అద్భుతంగా రాణిస్తున్నారు.ట్రెంట్‌ బౌల్ట్‌ ఆరంభంలో బ్యాటర్లను హడలెత్తిస్తుండగా… డెత్‌ ఓవర్లలో అవేశ్‌ ఖాన్‌, కుల్దీప్‌ సేన్‌ పసందైన బంతులతో ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేస్తున్నారు. మరోవైపు ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ రాణిస్తున్నప్పటికీ హార్దిక్ పాండ్యా బ్యాటింగ్, బౌలింగ్ లో తడబడుతున్నాడు. బౌలింగ్‌లో స్పీడ్‌ స్టార్ జస్‌ప్రీత్‌ బుమ్రా మినహా మిగతా బౌలర్లు విఫలమవుతుండడం ఆ జట్టును కలవరపెడుతోంది. కాగా సూర్యకుమార్‌ యాదవ్‌ ఫామ్‌లోకి రావడం ముంబైకు ప్లస్ కానుంది. ఈ సీజన్‌లో సూర్య కుమార్ యాదవ్ ఇప్పటికే రెండు అర్థసెంచరీలు సాధించాడు. కాగా గత మ్యాచ్‌లో ముంబై 9 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను ఓడించింది. ఇక రాజస్థాన్ చివరి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై 224 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది.

రాజస్థాన్ రాయల్స్ జట్టు: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మన్ పావెల్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్.

ముంబై ఇండియన్స్ జట్టు: రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ , సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, మహ్మద్ నబీ, జెరాల్డ్ కోయెట్జీ, శ్రేయాస్ గోపాల్, జస్ప్రీత్ బుమ్రా.

Also Read: IPL 2024 : 5 ఓవర్లలో 103 రన్స్ కొట్టి SRH సరికొత్త రికార్డు