DC Thrashes RR: దంచి కొట్టిన మార్ష్, వార్నర్…ఢిల్లీ ఘన విజయం

ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ఢిల్లీ అదరగొట్టింది. రాజస్థాన్ ని 8 వికెట్ల తేడాతో చిత్తు చేసి రన్ రేట్ కూడా మెరుగు పరుచుకుంది.

  • Written By:
  • Publish Date - May 11, 2022 / 11:46 PM IST

ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ఢిల్లీ అదరగొట్టింది. రాజస్థాన్ ని 8 వికెట్ల తేడాతో చిత్తు చేసి రన్ రేట్ కూడా మెరుగు పరుచుకుంది.
టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌ రాయల్స్‌కు మొదట్లోనే షాక్‌ తగిలింది. స్టార్‌ ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌ మరోసారి విఫలమయ్యాడు. అయితే ఆ తర్వాత యశస్వి జైస్వాల్‌తో జత కలిసిన అశ్విన్‌ రెండో వికెట్‌కు 43 పరుగులు జోడించాడు. ఆ తర్వాత జైస్వాల్‌ ఔటయ్యాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన దేవ్‌దత్‌ పడిక్కల్‌.. అశ్విన్‌తో కలిసి మూడో వికెట్‌కు 53 పరుగులు జోడించాడు. ఈ మ్యాచ్‌లో ప్రమోషన్‌ అందుకొని మూడోస్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అశ్విన్‌.. టీమ్‌ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. అతడు కేవలం 37 బాల్స్‌లోనే 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో హాఫ్‌ సెంచరీ చేశాడు. ఆ వెంటనే ఔటయ్యాడు. అశ్విన్‌ ఔటైన తర్వాత వచ్చిన కెప్టెన్‌ సంజు శాంసన్‌ నిరాశపరిచాడు. వీళ్లు ఔటైన తర్వాత కూడా దేవ్‌దత్‌ పడిక్కల్‌ జోరు కొనసాగించి.. రాజస్థాన్‌కు మంచి స్కోరు అందించాడు. పదిక్కల్ , అశ్విన్ రాణించడంతో రాయల్స్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 160 రన్స్‌ చేసింది.

రాజస్థాన్‌ నిర్ధేశించిన 161 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ.. మరో 11 బంతులుండగానే కేవలం రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. నిజానికి ఆ జట్టుకు తొలి ఓవర్‌లోనే షాక్‌ తగిలింది. ట్రెంట్‌ బౌల్ట్‌ బౌలింగ్‌లో వికెట్‌కీపర్‌ సంజూ శాంసన్‌కు క్యాచ్‌ ఇచ్చి శ్రీకర్‌ భరత్‌ డకౌటయ్యాడు. అయితే వార్నర్ , మార్ష్ రెండో వికెట్‌కు 74 పరుగులు జోడించారు. 10 ఓవర్ల తర్వాత వీరిద్దరూ మరింత దూకుడుగా ఆడటంతో స్కోరు వేగం తగ్గలేదు. రాజస్థాన్ బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేక పోయారు.
మిచెల్‌ మార్ష్‌ 62 బంతుల్లో 5 ఫోర్లు , 7 సిక్సర్లు 89 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడగా.. డేవిడ్‌ వార్నర్‌ 40 బంతుల్లో 49 నాటౌట్‌ కూడా రాణించాడు. మార్ష్ శతకం చేజార్చుకున్నా…వార్నర్ ఢిల్లీ విజయాన్ని పూర్తి చేశాడు. దీంతో డూ ఆర్ డై మ్యాచ్ లో ఢిల్లీ గ్రాండ్ విక్టరీ అందుకుని ప్లే ఆఫ్ రేసులో నిలిచింది. రాజస్థాన్ బౌలర్లలో బౌల్ట్‌, చహల్‌ తలో వికెట్‌ పడగొట్టారు.