Sanju Samson fined : ఓట‌మి బాధ‌లో ఉన్న సంజూ శాంస‌న్‌కు బీసీసీఐ షాక్‌..

అస‌లే ఢిల్లీ క్యాపిట‌ల్స్ చేతిలో ఓడిపోయిన బాధ‌లో ఉన్న రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కెప్టెన్ సంజూ శాంస‌న్‌ కు భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు షాకిచ్చింది.

  • Written By:
  • Updated On - May 8, 2024 / 11:23 AM IST

Sanju Samson fined : అస‌లే ఢిల్లీ క్యాపిట‌ల్స్ చేతిలో ఓడిపోయిన బాధ‌లో ఉన్న రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కెప్టెన్ సంజూ శాంస‌న్‌(Sanju Samson)కు భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) షాకిచ్చింది. అత‌డి మ్యాచ్ ఫీజులో ఏకంగా 30 శాతం జ‌రిమానాగా విధించింది. ఐపీఎల్ ప్ర‌వ‌ర్త‌నా నియమావళిలోని ఆర్టికల్ 2.8 ప్రకారం శాంసన్ లెవల్ 1 నేరానికి పాల్ప‌డిన‌ట్లు పేర్కొంది. ఈ నేరాన్ని శాంస‌న్ సైతం అంగీక‌రించిన‌ట్లు తెలిపింది.

‘ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.8 ప్రకారం శాంసన్ లెవల్ 1 నేరానికి పాల్పడ్డాడు. అతను నేరాన్ని అంగీకరించాడు. మ్యాచ్ రిఫరీ అత‌డి మ్యాచ్ ఫీజులో 30 కోత విధించాడు.’ అని బీసీసీఐ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

అస‌లేం జ‌రిగిందంటే?

మంగ‌ళ‌వారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ , ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. ఈ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 221 ప‌రుగులు చేసింది. భారీ ల‌క్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో ఆర్ఆర్ కెప్టెన్ సంజూ శాంస‌న్ 46 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స‌ర్ల సాయంతో 86 ప‌రుగులు చేశాడు.

16వ ఓవ‌ర్‌లోని నాలుగో బంతికి సంజూ ఔట్ అయ్యాడు. ఢిల్లీ బౌల‌ర్ ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో సంజూ లాంగ్ ఆన్ దిశ‌గా భారీ షాట్ కొట్టాడు. అయితే.. బౌండ‌రీ వ‌ద్ద నిల‌బ‌డి ఉన్న షై హోప్ ఎంతో ఒడుపుగా క్యాచ్ అందుకున్నాడు. కాగా.. హోప్ కాలు బౌండ‌రీ లైన్‌ను తాకిన‌ట్లుగా కనిపించింది. థ‌ర్డ్ అంపైర్ చెక్ చేసి సంజూను ఔట్‌గా ప్ర‌క‌టించాడు.

ఔట్‌గా ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ కూడా సంజూ మైదానాన్ని వీడేందుకు నిరాక‌రించాడు. అంపైర్‌తో చాలా సేపు వాదించాడు. ఈ స‌మయంలో అత‌డు రివ్వ్యూ తీసుకోవాల‌ని భావించాడు. అయితే.. ఈ నిర్ణ‌యాన్ని థ‌ర్డ్ అంపైర్ ఇచ్చాడ‌ని చెప్ప‌డంతో చేసేది లేక మైదానాన్ని వీడాడు.

థ‌ర్డ్ అంపైర్ ఔట్ అని ఇచ్చిన‌ప్ప‌టికీ కూడా మైదానాన్ని వీడ‌కుండా అంపైర్ల‌తో వాగ్వాదానికి దిగ‌డం ఐపీఎల్ ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళి ఉల్లంఘ‌న కింద‌కు వ‌స్తుంది. ఈ కార‌ణం చేత‌నే శాంస‌న్ మ్యాచ్ ఫీజులో 30 శాతం కోత ప‌డింది.

శాంస‌న్ ఔట్ కావ‌డంతో రాయ‌ల్స్ వేగంగా వికెట్లు కోల్పోయింది. నిర్ణీత 20 ఓవ‌ర్లో 8 వికెట్లు కోల్పోయి 201 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. దీంతో 20 ప‌రుగుల తేడాతో ఓడిపోయింది.

Also read : Yuzvendra Chahal 350 T20 Wickets : టీ20ల్లో చాహ‌ల్ అరుదైన ఘ‌న‌త‌.. టీమ్ఇండియా క్రికెట‌ర్ల‌లో ఒకే ఒక్క‌డు