Eng vs Ind SERIES DRAW: రూట్, బెయిర్ స్టో సెంచరీల మోత..ఇంగ్లాండ్ దే చివరి టెస్ట్

టెస్ట్ క్రికెట్ లో ఇంగ్లాండ్ మరో రికార్డు సృష్టించింది. తొలిసారి 378 పరుగుల భారీ టార్గెట్ ను ఛేదించి రికార్డులకెక్కింది. జో రూట్, బెయిర్ స్టో చెలరేగిన వేళ కొండంత లక్ష్యం కరిగిపోయింది.

  • Written By:
  • Publish Date - July 5, 2022 / 04:41 PM IST

టెస్ట్ క్రికెట్ లో ఇంగ్లాండ్ మరో రికార్డు సృష్టించింది. తొలిసారి 378 పరుగుల భారీ టార్గెట్ ను ఛేదించి రికార్డులకెక్కింది. జో రూట్, బెయిర్ స్టో చెలరేగిన వేళ కొండంత లక్ష్యం కరిగిపోయింది. ఈ విజయంతో టెస్ట్ సిరీస్ ను 2-2తో సమం చేసింది. పిచ్ ఏమాత్రం సహకరించకపోవడంతో భారత బౌలర్లు ప్రభావం చూపలేకపోయారు. దీంతో నాలుగోసారి ఇంగ్లాండ్ గడ్డపై టెస్ట్ సిరీస్ గెలవాలనుకున్న టీమిండియా కల నెరవేరలేదు. రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ బ్యాటింగ్ చూసిన తర్వాత భారత్ ఓటమి ఖాయమైపోయింది.

ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్నివ్వడం..తర్వాత 3 వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. అయితే బెయిర్ స్టో , జో రూట్ భారత్ కు అవకాశం ఇవ్వలేదు. ఒత్తిడిలో మరోసారి వీరిద్దరూ తమదైన బ్యాటింగ్ తో అదరగొట్టారు. న్యూజిలాండ్ తో సిరీస్ ఫామ్ ను కొనసాగిస్తూ పూర్తి ఆధిపత్యం కనబరిచారు. చివరి రోజు భారత బౌలర్లు అద్భుతం చేస్తారేమోనని అభిమానులు ఆశించినా అదేమీ జరగలేదు. తొలి సెషన్ ఆరంభం నుంచే ఎదురుదాడికి దిగిన రూట్ , బెయిర్ స్టో స్వేఛ్ఛగా షాట్లు కొట్టారు.

భారత బౌలర్లలో ఏ ఒక్కరూ ప్రభావం చూపలేకపోయారు. ఇటీవలే న్యూజిలాండ్ పై టెస్ట్ సిరీస్ లో భారీ లక్ష్యాలను చాలా ఈజీగా ఛేదించిన ఇంగ్లాండ్ భారత్ పైనా అదే జోరు కొనసాగించింది. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ ఆలౌటైన తర్వాత రెండో ఇన్నింగ్స్ లో ఇంతటి భారీ టార్గెట్ ఛేదిస్తుందని ఎవ్వరూ అనుకోలేదు. అయితే 400 లోపు టార్గెట్ ఉంటే భారత్ కు కాపాడుకోవడం కష్టమేనని పలువురు అంచనా వేశారు. చివరికి వారి అంచనానే నిజమైంది. చివరి రోజు భారత బౌలర్లు కూడా మ్యాచ్ ను ముందే వదులుకున్నట్టు కనిపించింది. దాదాపు ప్రతీ ఓవర్ లోనూ ఇంగ్లాండ్ బ్యాటర్లు ఫోర్ కొట్టడం వారి దూకుడుగా ఉదాహరణగా చెప్పొచ్చు. రూట్ సెంచరీ చేసిన తర్వాత మరింత ధాటిగా ఆడాడు. రూట్ కెరీర్ లో ఇది 28వ సెంచరీ. అటు బెయిర్ స్టో తన సూపర్ ఫామ్ ను మరోసారి కంటిన్యూ చేశాడు.

తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ చేసిన బెయిర్ స్టో రెండో ఇన్నింగ్స్ లోనూ శతకం సాధించాడు. ఫలితంగా లంచ్ బ్రేక్ లోపే ఇంగ్లాండ్ విజయం పూర్తయింది. టెస్ట్ క్రికెట్ లో ఇంగ్లాండ్ కు అదే అత్యధిక ఛేదన. ఇంతకుముందు 2019 యాషెస్ సిరీస్ లో ఆస్ట్రేలియాపై 359 పరుగుల టార్గెట్ ను ఇంగ్లీష్ టీమ్ ఛేదించింది. తాజాగా ఆ రికార్డును బ్రేక్ చేస్తూ 378 పరుగుల టార్గెట్ ను సునాయాసంగా అందుకుంది. దీంతో టెస్ట్ సిరీస్ ను 2-2తో సమం చేసింది.