Site icon HashtagU Telugu

World Cup: వరల్డ్ కప్ గెలవాలంటే చాలా చేయాలి : రోహిత్

Rohit-Virat

Rohit-Virat

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కప్ గెలవాలంటే తాము చాలా పనులు చేయాలని చెప్పాడు. ఆటగాళ్లంతా ప్రశాంతంగా ఉండి ఆటపై దృష్టి పెట్టాలన్నాడు. అలా అయితేనే కోరుకున్న ఫలితాలు వస్తాయన్నాడు. టీమిండియా ప్రపంచకప్‌ గెలిచి చాలా కాలమే అయిపోయిందనీ, ఎలాగైనా కప్‌ గెలవాలన్నదే తమ లక్ష్యమన్నాడు. దీని కోసం ఒక్కో అడుగు వేసుకుంటూ వెళ్లాలనీ చెప్పాడు. పాక్‌తో మ్యాచ్‌ను సాధారణంగానే తీసుకుంటున్నామనీ, ఎంత చిరకాల ప్రత్యర్థి అయినా గెలుపోటములు సహజమని హిట్ మ్యాన్ వ్యాఖ్యానించాడు.

పాకిస్తాన్‌తో మ్యాచ్‌ అనగానే ఒత్తిడి ఉంటుందనీ, కానీ ఇలాంటివి పట్టించుకోమన్నాడు ఇక సెమీ ఫైనల్స్‌, ఫైనల్స్‌ గురించి ఇప్పుడే ఆలోచించమనీ చెప్పాడు. ముందు సూపర్‌-12లో మంచి ప్రదర్శన చేయాలనుకుంటున్నామనీ , ఇక జట్టుకు నాయకత్వం వహించడం గొప్ప గౌరవమన్నాడు. కెప్టెన్‌గా తనకు ఇదే తొలి ప్రపంచకప్ కావడం చాలా ఉత్సాహంగా ఉందన్నాడు. ఆస్ట్రేలియాలో పిచ్‌లు భిన్నంగా ఉంటాయనీ, తమకు ఇది సవాలుతో కూడుకున్నదన్నాడు. అందుకే అందరికంటే ముందుగా ఇక్కడ అడుగుపెట్టామనీ ముగించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన వార్మప్‌ మ్యాచ్‌లో టీమిండియా మంచి విజయాన్ని అందుకుంది. న్యూజిలాండ్‌తో వార్మప్‌ మ్యాచ్‌ వర్షార్పణం కావడంతో ఇక టీమిండియా నేరుగా ఆదివారం అక్టోబర్‌ 23న పాకిస్తాన్‌తో తలపడనుంది.