Site icon HashtagU Telugu

world cup 2023: సెంచరీ మ్యాచ్ లో రోహిత్ అదుర్స్.. హిట్ మ్యాన్ కెప్టెన్ ఇన్నింగ్స్ పై ప్రశంసలు

World Cup 2023 (66)

World Cup 2023 (66)

world cup 2023: లక్నో వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ 100 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ గెలుపుతో సెమీస్ కు చేరుకుంది. బ్యాటింగ్ లో కోహ్లీ, గిల్, శ్రేయాస్ అయ్యర్ నిరాశపరిచినా.. కెప్టెన్ రోహిత్ శర్మ కీలక ఇన్నింగ్స్ ఆడి ఆకట్టుకున్నాడు. ఓ పక్క వికెట్లు పడుతున్నా హిట్‌మ్యాన్‌ ఒత్తిడికి గురి కాకుండా ఓపికగా బ్యాటింగ్‌ చేశాడు. కష్టతరమైన పిచ్‌పై కీలక ఇన్నింగ్స్‌ ఆడటంతో భారత అభిమానులు హిట్‌మ్యాన్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. హ్యాట్సాఫ్‌ రోహిత్‌ భాయ్‌ అంటూ ఆకాశానికెత్తుతున్నారు. హిట్‌మ్యాన్‌ ఇంత సహనంగా బ్యాటింగ్‌ చేయడాన్ని ఎప్పుడూ చూడలేదని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. బౌలర్లకు అనుకూలించిన లక్నో పిచ్‌పై రోహిత్ శర్మ 101 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 87 పరుగులు చేసాడు.

ఈ మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్‌ ఆడిన హిట్‌మ్యాన్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో 18000 పరుగుల మార్కును దాటాడు. తద్వారా ఈ ఘనత సాధించిన ఐదో భారత క్రికెటర్‌గా, ఓవరాల్‌గా 20వ ఆటగాడిగా రికార్డులకెక్కాడు. రోహిత్‌కు ముందు సచిన్‌ 34357 పరుగులు, కోహ్లి 26121 పరుగులు, ద్రవిడ్‌ 24208 పరుగులు, గంగూలీ 18575 పరుగులతో 18 వేల రన్స్ క్లబ్ లో ఉన్నారు. ఇదిలా ఉంటే ఇంగ్లాండ్ తో మ్యాచ్ కెప్టెన్ గా రోహిత్ కు 100వది. ఈ ఘనత సాధించిన ఏడో భారత కెప్టెన్‌గా రోహిత్‌ రికార్డులకెక్కాడు. ఈ జాబితాలో మాజీ కెప్టెన్లు మహేంద్ర సింగ్ ధోని 332 మ్యాచ్‌లు, అజారుద్దీన్ 221 మ్యాచ్‌లు, విరాట్ కోహ్లి 213 మ్యాచ్‌లు, సౌరవ్ గంగూలీ 196 మ్యాచ్‌లు, కపిల్ దేవ్ 108 మ్యాచ్‌లు, రాహుల్ ద్రవిడ్104 మ్యాచ్‌లు ఉన్నారు.

రోహిత్‌ కెప్టెన్ గా 51 అంతర్జాతీయ టీ20ల్లోనూ, 40 వన్డేల్లోనూ, 9 టెస్టు మ్యాచ్‌ల్లోనూ భారత్ కు నాయకత్వం వహించాడు. ఓవరాల్ గా రోహిత్ విన్నింగ్ రికార్డు చూస్తే అన్ని ఫార్మాట్లలో కలిపి 74 మ్యాచ్ లలో గెలిపించాడు.

Also Read: world cup 2023: వరల్డ్ కప్ లో రోహిత్ సేన సూపర్ షో.. కప్పు కొట్టడం ఖాయమంటున్న ఫ్యాన్స్